అదానీపై చర్యలు తీసుకునే దమ్ముందా? చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో అదానీ ఎనర్జీ సరఫరా చేసే సౌర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్ధ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రభుత్వ పెద్దకు రూ.1750 కోట్లు ముడుపులు అందినట్లు అమెరికా దర్యాప్తు సంస్ధ ఎఫ్బీఐ నిర్ధారించింది. దీనిపై అమెరికా కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో కలకలం రేగుతోంది. ఈ సెగ అంతిమంగా ఏపీ ప్రభుత్వాన్ని తాకుతోంది.
అదానీతో జగన్ కుదుర్చుకున్న 7 వేల కోట్ల సౌర విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని, దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలని నిన్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ ఈ ఒప్పందం విషయంలో చంద్రబాబు నోరు మెదపడం లేదని, దీంతో అదానీ నుంచి మీకు కూడా ఆఫర్లు అందాయా అని షర్మిల ప్రశ్నిస్తున్నారు.

అలాగే సీపీఐ నేత రామకృష్ణ కూడా ఇదే విషయాన్ని తెరపైకి తెచ్చి అదానీతో డీల్ రద్దు చేసుకోవాలని కోరుుతున్నారు. తాజాగా అదానీ ఇస్తానన్న వంద కోట్లు వద్దంటూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రామకృష్ణ స్వాగతించారు.

ఈ నేపథ్యంలో జగన్ హయాంలో కుదుర్చుకున్న సోలార్ ప్రాజెక్టు డీల్ రద్దు చేసుకోవాలనే డిమాండ్, అలాగే ముడుపులపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్డితో విచారణ డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో అదానీకి ఈ సోలార్ ప్రాజెక్టులే కాదు, కీలకమైన కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కూడా జగన్ సర్కార్ కట్టబెట్టింది. అలాగే ఇతర రంగాల్లోనూ అదానీ జగన్ హయాంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో వీటిపై కూడా విచారణ చేయించడం లేదా సమీక్షించడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications