Free Gas Cylinders: దీపం 2 పథకానికి భారీ స్పందన-సర్కార్ గణాంకాల విడుదల..!
ఏపీలో కూటమి ఇచ్చిన ఎన్నికల హామీ అయిన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని తాజాగా దీపావళి సందర్భంగా అమలు ప్రారంభించింది. అయితే ఇందులో అక్కడక్కడా ఎదురవుతున్న సాంకేతిక లోపాల నేపథ్యంలో మొత్తం పథకం అమలుపైనే దుష్ప్రచారం మొదలైంది. అసలు ఈ పథకం అమలు కావడం లేదని, డబ్బులు రీయింబర్స్ మెంట్ కావడం లేదని విపక్షం విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో దీపం 2 పథకం అమలు తీరు ఎలా ఉందో ప్రభుత్వం ఇవాళ గణాంకాలు విడుదల చేసింది.
రాష్ట్రంలో దీపం-2 పథకంపై మహిళల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ 18 నాటికి రాష్ట్రంలో దీపం 2 పథకం కింద బుక్ అయిన మొత్తం సిలిండర్లు 42.43 లక్షలని ప్రభుత్వం తెలిపింది. అలాగే వీటిలో డెలివరీ చేసినవి 33.44 లక్షలు ఉన్నాయని పేర్కొంది. దీపం-2 పథకం ద్వారా లబ్దిపొందిన 28.86 లక్షల మంది మహిళలకు ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ.229 కోట్లు అని ప్రభుత్వం తెలిపింది.

దీపం 2 పథకం అమలులో భాగంగా ముందుగా డబ్బు చెల్లించి గ్యాస్ సిలెండర్లు బుక్ చేసుకున్న మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.182 కోట్లని ప్రభుత్వం తెలిపింది. ఇది ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో 79.52 శాతంగా తెలిపింది.
దీపం-2 పథకం సూపర్ హిట్ అనేందుకు ఈ లెక్కలే నిదర్శనమని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అయితే సాంకేతిక కారణాలతో కేవలం 2,758 మంది లబ్దిదారుల ఖాతాల్లో మాత్రం రూ.21.78 లక్షలు జమ కాలేదని కూడా వెల్లడించారు. తద్వారా భారీ స్పందన వస్తున్న ఈ కార్యక్రమంపై దుష్ప్రచారం తగదని ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications