సీబీఐ చేతికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు- సిట్ రద్దు: హైకోర్టు తీర్పు- ఇక కేంద్ర పరిధిలో..!?
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు ఇక కేంద్ర విచారణ సంస్థ సీబీఐ పరిధిలోకి వెళ్లనుంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును విచారిస్తోంది. సిట్ విచారణను హైకోర్టు రద్దు చేసింది. కేసు వివరాలను మొత్తంగా సీబీఐకి అందించాలని హైకోర్టు ఆదేశించింది. దేశ వ్యాప్తంగా రాజకీయ సంచలనానికి కారణమైన ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో బీజేపీ నేతల ప్రమేయం పైన టీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బీఎల్ సంతోష్ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటీషన్ల పైన విచారించిన తెలంగాణ హైకోర్టు ఈ కేసును సిట్ నుంచి తప్పిస్తూ సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం ప్రకటించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భారీ మలుపు
గత అక్టోబర్ లో మొయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కొందరు మధ్య వర్తులు ప్రయత్నించారు. బీజేపీ ముఖ్యనేతల దూతలుగా వారు వచ్చినట్లుగా టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ ముగ్గురూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో జరిపిన బేరసారాలు..వారు ప్రస్తావించిన అంశాలను మొత్తంగా ఆడియో వీడియోలను స్వయంగా సీఎం కేసీఆర్ బయట పెట్టారు. అన్ని పార్టీలు..అన్ని రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీం న్యాయమూర్తులకు ఆ ఫుటేజ్ ను పంపారు. ఈ కేసు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసారు. ఇప్పటికే సిట్ ఆ ముగ్గరితో పాటుగా వారు సంభాషణల్లో ప్రస్తావించిన వారికి నోటీసులు పంపింది. కేసు విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో హైకోర్టులో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటీషన్లు దాఖలు కాగా, విచారించిన హైకోర్టు కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ తీర్పు చెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వ సిట్ రద్దు..ఇక అంతా సీబీఐ చేతిలో
తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఏర్పాటు చేసిన సిట్ ను హైకోర్టు రద్దు చేసింది. సిట్ విచారణ సరిగ్గా జరగలం లేదన్న పిటీషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో పాటుగా సిట్ ఇప్పటి వరకు చేసిన విచారణ, సంపాదించిన ఆధారాలను సీబీఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు ఈ కేసును నమోదు చేసారు. ఆ తరువాత సిట్ కు కేసును బదిలీ చేసారు. ముగ్గురు నిందితుల ఫోన్లు, వాట్సాప్ ఛాటింగ్ లను సిట్ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బీఎల్ సంతోష్, తుషార్ వంటి వారికి సిట్ జారీ చేసిన నోటీసుల పైన హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు తాజా మొత్తంగా కేసునే సీబీఐకి అప్పిగిస్తూ తీర్పు ప్రకటించింది.

రాష్ట్రం నుంచి కేంద్ర విచారణ సంస్థ పరిధిలోకి
ఇప్పటి వరకు ఈ కేసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పోలీసు శాఖ విచారిస్తోంది. ఇప్పుడు హైకోర్టు తాజా ఆదేశాలతో ఇక ఈ కేసు కేంద్ర పరిధిలోని సీబీఐ చేతికి వెళ్లనుంది. సీబీఐ అధికారులు ఫాం హౌస్ ఎపిసోడ్ నుంచి తిరిగి విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు ఈ తీర్పు పైన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది. రాజకీయంగా కీలకంగా మారిన ఈ కేసును సీబీఐకి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వెంటనే అప్పగిస్తుందా..ఈ తీర్పు పైన అప్పీల్ కు వెళ్తుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. కోర్టు తీర్పు తుది కాపీ వచ్చిన తరువాత ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications