Kumari Aunty: ఏపీలో హైదరాబాద్ కుమారి ఆంటీ ప్రచారం-ఎక్కడో, ఎవరికో తెలుసా ?
హైదరాబాద్ కుమారి ఆంటీ గుర్తుంది కదా.. ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఆమె టిఫిన్ హోటల్ ను అధికారులు తొలగిస్తే జరిగిన రచ్చ తెలుసు కదా.. ఆ తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని మరీ ఆమెకు సాయం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కుమారీ ఆంటీ ఏపీ ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రంలో హోరాహోరీ పోరు జరుగుతున్న ఓ కీలక నియోజకవర్గంలో ఆమె ప్రచారానికి దిగారు.
రాష్ట్రంలో ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీట్ గా మారిపోయిన గుడివాడ నియోజకవర్గంలో కుమారీ ఆంటీ తన ప్రచారం ప్రారంభించారు. గతేడాది హైదరాబాద్ లో తన టిఫిన్ హోటల్ తొలగింపు తర్వాత వార్తల్లో వ్యక్తిగా మారిపోయిన కుమారి ఆంటీకి ఏపీలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్ లో హోటల్ నడుపుకుంటున్న ఆమెకు ఈ వివాదం తర్వాత సోషల్ మీడియాలో భారీ క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్ధి ఆమెను ప్రచారానికి ఆహ్వానించారు.

గుడివాడ సీటులో ప్రస్తుతం వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికీ, టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాముకూ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. గత నాలుగు దఫాలుగా వరుసగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తున్న కొడాలి నానికి ఈసారి గట్టి పోటీ ఇస్తున్న వెనిగండ్ల రాము ప్రచారంలో అన్ని అస్త్రాలూ వాడుతున్నారు. ఇదే క్రమంలో కుమారి ఆంటీని సైతం రంగంలోకి దింపారు. దీంతో రాముతో కలిసి కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఈసారి రాముకు ఓటేయాలని అభ్యర్ధించారు.
కుమారి ఆంటీ హైదరాబాద్ నుంచి గుడివాడకు ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. రావాల్సి వచ్చిందంటీ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని తెలిపింది. అందరూ కలిసి గుడివాడను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చింది. అందుకే టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాముకు అందరూ మద్దతిచ్చు గెలిపించాలని కోరింది. ఉపాధి లేకపోవడం వల్లే తాను గుడివాడ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. ఈసారి రామును గెలిపించి కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరింది.












Click it and Unblock the Notifications