'అలగలేదు, నా ఫ్యాన్స్‌కాదు': టిడిపి వేడుకలో జై పవన్
విజయవాడ/గుంటూరు: తాను అలిగానంటూ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆదివారం చెప్పారు. టిడిపి కార్యాలయం పైన తన అభిమానులు దాడులకు పాల్పడలేదని చెప్పారు. మంత్రిపదవి ఇవ్వకపోవడంపై తనకు ఎలాంటి అంసతృప్తి లేదని చెప్పారు.
పదవులు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, అలాగే రానప్పుడు బాధపడవద్దని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చారిత్రక ఘట్టమన్నారు.
అదృష్టంగా భావిస్తున్నా: గంటా

చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం గర్వంగా భావిస్తున్నానని గంటా శ్రీనివాస రావు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. బాబు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. సవాళ్ల మధ్య బాబు అధికారం చేపడుతున్నారని, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హామీలు నెరవేర్చుతాం
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేరుస్తామని టిడిపి ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వర రావు, పీతల సుజాతలు చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పని చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.
జై పవన్ కళ్యాణ్
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు తరలి వచ్చారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తరలి వచ్చారు. పవన్ అభిమానులు జై పవన్ అంటూ నినదించారు. సింహా, లెజెండ్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను వచ్చారు.












Click it and Unblock the Notifications