బాబును జైలుకు పంపాలని దైవాన్ని ప్రార్థిస్తున్నా: విజయసాయి రెడ్డి
కాకినాడ: తమను అన్యాయంగా జైలుకు పంపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. తమను జైలుకు పంపిన కుట్రలో చంద్రబాబు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు నేరం చేశాడు కాబట్టే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు. ఆధారాలు ఉన్నప్పటికీ చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయని, ఇటువంటి స్థితిలో 120 ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. దేశంలో టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు అమ్మేది పాటూరి రామారావు, సుజనాచౌదరి మాత్రమేనని విజయసాయి ఆరోపించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా తీవ్రంగా మండిపడ్డారు. తన పదవిని చౌకబారుగా చూసుకునే అహంభావి యనమలేనని ఆయన అన్నారు. యనమల అమెరికా అధ్యక్షుడు కావాల్సిందని, తప్పిపోయి ఎపిలో పుట్టి ఆర్థిక మంత్రి అయ్యారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
ఈ ఏడాది తుని నియోజకవర్గంలో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. దీనిపై దుమ్ముంటే యనమల రామకృష్ణుడు బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను, తమ పార్టీ నాయకులను విమర్శించడానికి యనమలకు ఎంత మాత్రం కూడా అర్హత లేదని ఆయన అన్నారు. ఇప్పటికి రెండు సార్లు తుని ప్రజలు యనమలను ఛీకొట్టారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications