రోజాకు నాపై కోపం ఎందుకో, రాహుల్‌గాంధీ సాయంతో బాబు సీఎం అయితే జనం..: జేసీ దివాకర్‌రెడ్డి
అనంతపురం/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అనంతపురం లోకసభ సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తన పైన ఎందుకు మండిపడుతున్నారో తెలియదని విమర్శించారు.

రాహుల్ గాంధీ సహకారంతో చంద్రబాబు సీఎం అయితే జనం హర్షించరు
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సహాయంతో తమ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే జనం హర్షించరని కుండబద్దలు కొట్టారు. కానీ ముఖ్యమంత్రి పదవి కోసమే రాహుల్ గాంధీతో చంద్రబాబు కలవలేదని చెప్పారు. కాగా, రాహుల్ గాంధీ, చంద్రబాబులు భేటీ ఇటీవల ఢిల్లీలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది రాజకీయ వర్గాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారం, ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై జేసీ పైవిధంగా స్పందించారు.

మా సొంత బలం చాలు
2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తమకు ఉన్న సొంతబలం చాలునని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. నవ్యాంధ్రలో పొత్తుల కోసం లేదా ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆరాటపడటం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్, జనసేన, టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా చంద్రబాబు పొత్తు కోసం ఆరాటపడటం లేదని, దేశం కోసం కాంగ్రెస్ సహా విపక్షాలను కలుస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ప్రబోధానందపై జేసీ దివాకర్ రెడ్డి
అదే సమయంలో ప్రబోధానంద అంశం గురించి కూడా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. ప్రబోధానంద ఓ ఫ్యాక్షనిస్టు అని, ఆయనతో తనకు రాజీ ఏమిటని నిప్పులు చెరిగారు. కొద్ది రోజుల క్రితం.. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రబోధానంద అనుచరులు, జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.

రోజా వ్యాఖ్యలకు జేసీ కౌంటర్
విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిందితుడు శ్రీనివాస రెడ్డి దాడి చేయగా.. దీనిపై టీడీపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. జేసీ కూడా ఈ ఘటనపై స్పందించారు. దానికి రోజా శనివారం కౌంటర్ ఇస్తూ... కోడి కత్తితో జేసీ దివాకర్ రెడ్డి ఓసారి పొడుచుకుంటే ఏమవుతుందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. దీనిపై జేసీ మంగళవారం స్పందిస్తూ.. రోజా తన పైన ఎందుకు మండిపడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications