విశాఖను మరువను: వెంకయ్య, పుట్టింటికి వచ్చినట్లే
విశాఖపట్నం: తన జీవితంలో విశాఖపట్నంను మరిచిపోనని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖపట్నంలోనే తన రాజకీయ పునాది పడిందని ఆయన అన్నారు. శనివారం విశాఖకు వచ్చిన ఆయనకు బిజెపి శ్రేణులు, నగర నాయకులు సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖకు వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని తెలిపారు.
దేశంలోని అగ్రగామి నగరాల్లో విశాఖ గొప్పదని ఆయన అన్నారు. సమస్యలు తీర్చగలరన్న నమ్మకంతోనే విశాఖ ప్రజలు ఎంపీగా హరిబాబును గెలిపించారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కులం, ధనం కాదని గుణం గెలిపించిందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

పేద ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిన వారే సమర్థ నాయకులవుతారని ఆయన అన్నారు. దేశం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. దేశ ప్రజలు మంచి భవిష్యత్ కోసమే భారతీయ జనతా పార్టీకి ఓటేసి స్థిరమైన ప్రభుత్వానికి పట్టం కట్టారని వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు.
వెంకయ్య నాయుడుని ఎంపీలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్, మంత్రి గంటా శ్రీనివాస్, మాజీ ఎంపి మూర్తి, ఇతర బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులు సన్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిచ్చే నాయకుడని వెంకయ్య నాయుడిని విశాఖ నాయకులు కొనియాడారు.












Click it and Unblock the Notifications