రాజ్యసభకు నామినేట్‌పై చాలా ఘాటుగా స్పందించిన నాగబాబు
Nagababu: రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యసభ ఉప ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన షెడ్యూల్ కూడా వెలువడింది. ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషన్ దీన్ని విడుదల చేసింది. అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమిలో అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు సాగుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు- మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ పదవులకు రాజీనామాలు చేయడంతో ఈ ఉప ఎన్నికలు అవసరం అయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 3వ తేదీన వెలువడుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి గడువు అదే నెల 10వ తేదీ. 20న ఎన్నికలు ఉంటాయి.

ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడానికి అవసరమైన సంఖ్యా బలం వైఎస్ఆర్సీపీకి లేదు. ఎన్నికల రేసు నుంచి దాదాపుగా తప్పుకొన్నట్టే. ఫలితంగా ఈ ఎన్నికలు ఏకగ్రీవం కావడానికే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ-జనసేన- బీజేపీ ఈ మూడు సీట్లనూ పంచుకోవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచ ఒకరు ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు స్వయానా సోదరుడు, పార్టీ అధికార ప్రతినిధి నాగబాబు నామినేట్ అవుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇటీవలే తన హస్తిన పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ స్వయంగా బీజేపీ నేతల ముందు ఈ ప్రతిపాదన ఉంచారంటూ వార్తలొచ్చాయి.
దీనిపై తాజాగా నాగబాబు స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనంటూ పరోక్షంగా తేల్చి చెప్పారు. రాజకీయంగా ఎలాంటి పదవుల గురించీ తాను ఆలోచించట్లేదని పేర్కొన్నారు. తన నాయకుడు పవన్ కల్యాణేనని, ఆయన సారథ్యంలో నిస్వార్థంగా పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ స్వార్థం తెలియని ప్రజానాయకుడని నాగబాబు కీర్తించారు. ఆయన చేసే ప్రతి పని కూడా ప్రజా శ్రేయస్సు కోసమేనని, ఇందులో వ్యక్తిగత స్వార్థానికి ఆస్కారం లేదని చెప్పారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు పవన్ కల్యాణ్ ఎప్పుడూ దూరంగానే వుంటాడని అన్నారు.
ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడని, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు, పోరాడతాడని కితాబిచ్చారు. ఢిల్లీ వెళ్లిన ఉద్దేశం కూడా స్వార్థ ప్రయోజనాల కోసం ఎంత మాత్రమూ కాదు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని నాగబాబు తేల్చి చెప్పారు. అలాంటి నాయకుడి కోసం తన జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications