బాబుని నువ్వెవడివయ్యా అన్నా, కేసీఆరే తెలంగాణ సాధించారు.. ఇదెంత: జగన్
ఏలూరు: ప్రత్యేక హోదా వద్దని చెప్పడానికి నువ్వెవడివయ్యా అని ఏపీ సీఎం చంద్రబాబును తాను అసెంబ్లీలో నిలదీశానని వైసిపి అధినేత జగన్ గురువారం అన్నారు. ఏలూరులో నిర్వహించిన యువభేరీలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా బాబుపై నిప్పులు చెరిగారు.

నువ్వెవడివయ్యా స్వాగతించడానికి అని అడిగా
ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయని, అప్పుడు నేను అన్నానని, నువ్వెవడయ్యా స్వాగతించడానికి, ఐదున్నర కోట్ల మంది జీవితాలు హోదా పైన ఆధారపడి ఉన్నాయని, అలాంటప్పుడు ప్యాకేజీని ఎలా స్వాగతిస్తావని ప్రశ్నించానని అన్నారు. మాకెవరికీ ఇష్టం లేకున్నా నువ్వెవడివయ్యా స్వాగతించడానికి అని నేను గట్టిగా నిలదీశానని చెప్పారు. దీంతో, శాసన సభలో చెప్పే ధైర్యం చాలక శాసన మండలికి వెళ్లాడన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుందని మండలిలో చంద్రబాబు అన్నాడని, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు హోదా వల్ల ఏం మంచి జరిగిందని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు.

హోదా చంద్రబాబు అత్త సొత్తు కాదు
ప్రత్యేక హోదా చంద్రబాబు అత్త సొత్తు కాదన్నారు. చంద్రబాబు మోసాలు తారాస్థాయికి చేరాయన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అన్నారు. మొన్నటి దాకా హోదా కావాలన్న వ్యక్తి ఇప్పుడు అవసరమా అని చెప్పడం ఏమిటన్నారు. రాష్ట్రాన్ని చీల్చి, ఇప్పుడు టిడిపి-బిజెపి మోసం చేస్తోందన్నారు. విభజనతో హైదరాబాదును కోల్పోయామని, అందుకే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారన్నారు. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారన్నారు. రెండున్నరేళ్లు గడిచినా హామీ నిలబెట్టుకోలేదన్నారు. ఆర్థిక లోటును భర్తీ చేస్తామని ఎన్నోసార్లు చెప్పారన్నారు.

అందుకే బాబు గట్టిగా అడగలేడు, బీజేపీ కాళ్లు వదలట్లేదు
ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి హోదా గురించి గట్టిగా అడగలేని విధంగా ఉందని అన్నారు. అందుకు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడమే కారణమని ఆరోపించారు. హోదా ఇవ్వకున్నా చంద్రబాబు బీజేపీ కాళ్లు పట్టుకొని వదలట్లేదన్నారు. ఢిల్లీ వాళ్లు ఏమిట్టినా ఫరవాలేదంటున్నారు. నీతి అయోగ్‌కు, 14వ ఆర్థిక సంఘానికి, కేబినెట్‌కు.. ఇలా అన్నింటికి ప్రధానియే ముఖ్యమని, అలాంటప్పుడు హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇప్పటి దాకా 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారని గుర్తు చేశారు.

ఇతర రాష్ట్రాలు అడుగుతాయని చెప్పడం ఏమిటి
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయని బీజేపీ, టీడీపీలు చెబుతున్నాయని, హోదా పైన హామీ ఇచ్చిన సమయంలో ఇతర రాష్ట్రాలు లేవా అని నిలదీశారు. ప్రత్యేక హోదాతో ఏం రాదని చెబుతున్నారని కానీ అది శుద్ధ అబద్దమన్నారు. హోదా వల్ల ఏం లాభమో జగన్ ఈ సందర్భంగా వివరించారు. పారిశ్రామిక రాయితీలు హోదా వల్లనే సాధ్యమన్నారు.

ప్రత్యేక ప్యాకేజీ ఎలా అవుతుంది?
కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో కొత్తగా వచ్చిందేమిటన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే మనకు ఇస్తున్నారని చెప్పారు. అలాంటప్పుడు మనకు కొత్తగా ప్యాకేజీ వల్ల లాభం ఏమిటో చెప్పాలన్నారు. తాము ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశామని, ఢిల్లీలో దీక్షలు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5వేల కోట్లు ఇవ్వమని కేంద్రం చెబితే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రూ.16వేల కోట్ల ప్రాజెక్టులో రూ.5వేల కోట్లకు పైగా ఇవ్వమని చెబితే దానికి చంద్రబాబు భేష్ అంటున్నారని అభిప్రాయపడ్డారు.

ఆ రాష్ట్రాల్లోను ఐఐటీలు.. వెంకయ్య అబద్దాలు
ట్రిపుల్ ఐటీ, ఎయిమ్స్.. ఇలా ఎన్నో ఇచ్చామని జైట్లీ చెబితే, చంద్రబాబు ఆహా ఓహో అని చెప్పారని, ఇది విడ్డూరమన్నారు. కానీ కోటి జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. అలాంటప్పుడు ఏపీకి ఇవ్వడం ఏం ఫేవర్ చేసినట్లు అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పైన మాట మార్చిన వెంకయ్య, నిధుల విషయంలోను అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. నాడు ఏదో వేడిలో హోదా అడిగానని చంద్రబాబు అనడం విడ్డూరమన్నారు.

సాధ్యం కాదన్న తెలంగాణ కేసీఆర్ సాధించారు
తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని చాలామంది అన్నారని కానీ అలాంటి దానిని కేసీఆర్ సాధించారని, అలాంటప్పుడు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని మనం సాధించుకోలేమా అని జగన్ అన్నారు. మనం దీనిని కచ్చితంగా సాధిస్తామని చెప్పారు. అందుకోసం పోరాడుదామన్నారు. అయితే నా ఒక్కడి వల్ల కాదని, అందరం కలిసి పోరాడి సాధిస్తామన్నారు.

సొంత మామమకే వెన్నుపోటు
ఢిల్లీలో బీజేపీ నేతలు హోదా ఇవ్వని పరిస్థితి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడగని పరిస్థితి ఉందని జగన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో నుంచి వారు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా ఫర్వాలేదు అన్న ధోరణిలో చంద్రబాబు ఉన్నారని, బీజేపీని వదలబోననే అంటున్నారని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నందుకే చంద్రబాబు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. ఒక ముఖ్యమంత్రి సూట్‌కేసులు పంపించినా.. ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినా అరెస్టు కాలేదన్నారు.
రాజీనామా చేయలేదు.. మన దేశంలోనే ఇటువంటి పరిస్థితి ఉందన్నారు. అంతగొప్పగా చంద్రబాబు మేనేజ్ చేయగలుగుతారన్నారు. అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచారు ఇక ఐదు కోట్ల ఆంధ్రులని మోసం చేయరా అని ప్రశ్నించారు. హోదాపై ఇప్పుడు ఎన్నో తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారన్నారు.












Click it and Unblock the Notifications