లగడపాటి, జగ్గారెడ్డినీ చేర్చుకో: ఎర్రబెల్లి, టిడిపిలోకి నాని

తెలంగాణ ద్రోహులను తన పార్టీలో చేర్చుకోవడంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు సమాధానం చెప్పాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. కరుడుగట్టిన సమైక్యవాదులైన లగడపాటి రాజగోపాల్, జగ్గారెడ్డిలను టిఆర్ఎస్‌లో చేర్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎర్రబెల్లి అన్నారు.
టిడిపిలోకి ఈలి నాని
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈలి నాని ఆ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసిన నాని టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఈలినాని చెప్పారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది బాబే: తలసాని
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బలహీన వర్గాలను ఆదుకోవాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని, వారి నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరి అభిప్రాయం తీసుకునే అలవాటు చంద్రబాబుదని చెప్పారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు మాట మార్చారని తలసాని ఆరోపించారు.
టిఆర్ఎస్ ఇంటి పార్టీ: పొన్నాల
తెలంగాణ రాష్ట్ర సమితి ఇంటి పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ నెలాఖరున వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్వహించే సభలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరవుతారని చెప్పారు.
ప్రస్తుతం సిట్టింగ్ స్థానాల్లో ఉన్నవారందరికీ టికెట్ లభిస్తుందని చెప్పారు. పిసిసి ఆపీష్ బేరర్స్ నుంచి సమాచారం తీసుకుని ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలన్నదానిపై చర్చిస్తామని చెప్పారు. సీట్లు ముందే కేటాయించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదని పొన్నాల తెలిపారు.












Click it and Unblock the Notifications