రఘురామ విషయంలో లోక్‌సభ స్పీకర్ పక్షపాత ధోరణి: పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం: సాయిరెడ్డి
విశాఖపట్నం జిల్లాలో ఉండే గ్రామీణ ప్రాంతాలకు 12 టీఎంసీల మంచినీటిని పైప్‌లైన్ ద్వారా అందించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్‌కు డీపీఆర్ సిద్ధమైందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తెలిపారు. 126 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏలేశ్వరం నుంచి నరవా వరకు ప్రాజెక్ట్ కాస్ట్ 3,570 కోట్ల రూపాయలు, ఇందులో సగం భాగాన్ని జల్ జీవన్ మిషన్ కింద భరించాలంటూ సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశామని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నెలకొన్న వివాదాలనూ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, వాటన్నింటినీపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
ఈ ఉదయం ఆయన దేశ రాజధానిలో విలేకరులతో మాట్లాడారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామ కృష్ణంరాజు అనర్హత వేటు అంశాన్ని చర్చించినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. ఈ విషయంలో ఆయన చేసిన కొన్ని సూచనలకు అనుగుణంగా అనర్హత వేటు పిటీషన్‌ను తాము సిద్ధం చేశామని స్పష్టం చేశారు. స్పీకర్ అడిగిన అదనపు సమాచారాన్ని కూడా అందించినట్లు చెప్పారు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం, పార్టీని ఉద్దేశించి.. రఘురామ కృష్ణంరాజు చేసిన అప్రజాస్వామ్యం, అసంబద్ధమైన వ్యాఖ్యలన్నింటినీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని అభ్యర్థించామని అన్నారు.
రఘురామ కృష్ణంరాజు అనర్హత విషయంలో తాము చేసిన విజ్ఞప్తులకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోనట్టయితే.. పార్లమెంట్‌లో తాము నిరసన ప్రదర్శనలను చేస్తామని కూడా స్పీకర్‌కు తెలియజేశామని సాయిరెడ్డి స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సిందిగా కోరినట్లు చెప్పారు. వచ్చే సమావేశాల్లో ప్రభుత్వం, స్పీకర్ ఏ నిర్ణయాన్ని తీసుకుంటారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని అన్నారు.

అనర్హత వేటు విషయంపై తొలుత 15 రోజుల నోటీసులను ఇచ్చి, ఆ తరువాత ఈ పిటీషన్‌ను ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తామని స్పీకర్ ఓం బిర్లా తమకు తెలిపారని సాయిరెడ్డి చెప్పారు. అనర్హత వేటు పిటీషన్‌ను ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేసిన సందర్భాలు లేవని అన్నారు. ఇదివరకు రబీ రే, సోమ్‌నాథ్ ఛటర్జీ, ఇతర స్పీకర్లు ఎవరూ దీన్ని పాటించలేదని గుర్తు చేశారు. ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా ఒక కొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నట్లు కనిపిస్తోందని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రఘురామ వ్యవహారంలో ఎవరి ప్రివిలేజ్ దెబ్బతిన్నదనే విషయాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
రఘురామ కృష్ణంరాజు తమ పార్టీని, తమ ముఖ్యమంత్రిని, తమ ప్రభుత్వాన్ని దూషించాడని- ఈ రకంగా చూసుకున్నా తమ ప్రివిలేజ్ బీటలు వారిందనే విషయం స్పష్టమౌతోందని అన్నారు. రఘురామ అనర్హత పిటీషన్‌ను గనక స్పీకర్.. ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తే- దాన్ని తాము గట్టిగా వ్యతిరేకిస్తామని సాయిరెడ్డి తేల్చి చెప్పారు. అవసరమైతే సభను స్తంభింపజేస్తామనీ అన్నారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ఇదివరకు శరద్ యాదవ్ విషయంలో వారం రోజుల్లోనే రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.
Recommended Video
తాము ఏడాదికాలంగా రఘురామ అనర్హత పిటీషన్‌పై సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని విజయసాయి రెడ్డి అన్నారు. స్పీకర్ వద్ద నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. తాము అందజేసిన అనర్హత వేటు పిటీషన్‌లో అన్ని పేజీలపైనా సంతకాలు లేవనే విషయాన్ని ఏడాది తరువాత స్పీకర్ గుర్తించి తమకు తెలియజేశారని, దాన్ని సవరించి మళ్లీ ఆయనకు అందజేశామని అన్నారు. ఏదైనా పిటీషన్‌ను ఆరు నెలల్లోగా డిస్పోజ్ చేయాల్సి ఉంటుందంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా గుర్తు చేశామని స్పష్టం చేశారు. రఘురామ అనర్హత వేటు విషయంలో స్పీకర్ పక్షపాత ధోరణితో కూడుకున్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications