సిట్టింగ్ లందరికీ సీట్లంటే.. గంటా శ్రీనివాసరావుకు ఉన్నట్లా? లేనట్లా?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయడు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే అందుకు తగ్గట్లుగానే రాజకీయం చేయాల్సి ఉండటంతో తన సహజశైలికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పుడూ నామినేషన్ ముగిసే చివరి తేదీ వరకు అభ్యర్థిని ఖరారు చేయని చంద్రబాబు ఈసారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీలో ఆయన ఏం చేసినా సంచలనమే అవుతోంది.

23కు 19 మంది మిగిలారు!
'బాదుడే బాదుడు'తో జిల్లాల పర్యటన చేస్తున్నప్పటి నుంచి అభ్యర్థులను ఏడాదిన్నర ముందుగానే ప్రకటిస్తూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 23 సీట్లు గెలుచుకోగలిగింది. ఆ 23 మందిలో గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ నుంచి మద్దాలి గిరి, చీరాల నుంచి కరణం బలరాం, విశాఖ దక్షిణం నుంచి విజయం సాధించిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ పంచన చేరి ఆ పార్టీకి అనుబంధ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వారిని మినహాయిస్తే 19 మంది ఎమ్మెల్యేలున్నారు. తాజాగా చంద్రబాబు సిట్టింగ్ లందరూ వారివారి స్థానాల్లో పనిచేసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో కూడా అక్కడినుంచి వారే అభ్యర్థులని ప్రకటించారు. అయితే ఒక అంశం ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తోంది.

గంటాకు సీటుందా? లేదా?
19 మంది ఎమ్మెల్యేల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావుకు సీటుందా? లేదా? అనే మీమాంస పార్టీలోనే కాదు.. ప్రజల్లో కూడా నెలకొంది. ఈ విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చిచెప్పడంలేదని ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు గుస్సా అవుతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. చంద్రబాబు కార్యక్రమాలు, మినీ మహానాడులోనే కాకుండా నియోజకవర్గంలోనే ఆయన ఎక్కడా పర్యటించడంలేదు. ఏ కార్యక్రమంలోను పాల్గొనడంలేదు. పార్టీ అధిష్టానానికి కూడా అందుబాటులోకి రావడంలేదు. ఇటీవల ఒకటి రెండుసార్లు అక్కడక్కడా మెరిశారుకానీ పూర్తిగా ఆయన రాజకీయ జీవితానికి దూరం జరిగినట్లుగా అర్థమవుతోంది.

కనీసం ఇన్ఛార్జినైనా నియమించడి..
అందరికీ సీట్లని చెప్పి ఇప్పుడు విశాఖ ఉత్తరం గురించి కూడా స్పష్టత ఇవ్వాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా అక్కడి నుంచి విష్ణుకుమార్ రాజు గెలుపొందారు. పొత్తుల సంగతి ఏమీ తేల్చకపోయినప్పటికీ అభ్యర్థులను ముందే ప్రకటించాలని కోరుతున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారే అలవాటుంది కాబట్టి ఆయన పోటీచేస్తారా? లేదా? అనేది చెప్పాలంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసింది ఏమీలేదని, ఆయన అందుబాటులో ఉండకపోవడంవల్ల స్థానికుల్లో నెలకొన్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీవైపు మళ్లుతుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. కనీసం ఇక్కడ ఇన్ఛార్జిని నియమించినా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకొని పనిచేయడానికి వీలవుతుందని, మీమాంసలో పడ్డ గంటా శ్రీనివాసరావు విషయంలో కూడా స్పష్టతనివ్వాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications