మళ్లీ భారీ వర్షాలు, మూడు రోజులు దంచుడే - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. పగలు ఎండ.. సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో నదుల్లో ప్రవాహం పెరిగింది. పలు జిల్లాలకు తాజాగా మరోసారి భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్.. మరి కొన్నింటికి ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసారు.
ఏపీ విపత్తుల శాఖ రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు పైన హెచ్చరిక చేసింది. కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం,విజయనగరం, అల్లూరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పడతాయని చెప్పింది.
తెలంగాణలోనూ భారీ వర్ష సూచన ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాలతో పాటుగా ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్సాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముంది. ఈరోజు మహబూబాబాద్, సూర్యాపేట్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది.
అలాగే మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణితో పలు జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. వరుస వర్షాలతో దెబ్బ తిన్న మెదక్ జిల్లాలో కేంద్రం నుంచి వచ్చిన అధికారుల టీం పరిశీలన చేస్తోంది.












Click it and Unblock the Notifications