ఏపీలో అనూహ్య మార్పులు - అప్రమత్తంగా ఉండాల్సిందే..!!
ఒక వైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..మరోవైపు అకాల వర్షాలు. వాతావరణలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు పది రోజుల పాటు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పుల తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అకాల వర్షాలు నష్టం మిగిల్చాయి. ఇప్పుడు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఏపీలో ఎనిమిది జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు నేడు శ్రీకాకుళం,మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ,ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడి తేలికపాటి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేసింది. అదే విధంగా..ఉభయగోదావరి,కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇక, ఈ రోజు సాయంత్రం నుంచి రాయలసీమలో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఎక్కడైనా ఎపుడైనా ఉరుములు మెరుపులతో వర్షం ఉన్నప్పుడు చెట్ల క్రింద ఉండవద్దని హెచ్చరించింది. పొలంలో రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరో వైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు, ఈదురుగాలులతో కురిసిన వానలతో నష్టం జరిగింది. కోతకొచ్చిన మక్క, వరి చేన్లు నేలకొరిగిపపోయాయి. తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట్ జిల్లాలో రైతులు భారీగా నష్టపోయారు. అకాల వర్షాలతో జరిగిన నష్టం పైన ప్రాధమిక నివేదికలు సిద్దం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అటు ఏపీలోనూ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో విరుచుకుపడింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం రైతులకు అపారనష్టాన్ని మిగిల్చింది. వేలాది ధాన్యం బస్తాలు నీటమునిగాయి. కళ్లెదుటే ధాన్యం నీళ్లలో కొట్టుకుపోవడంతో కర్షకులు కన్నీటిపర్యంతమయ్యారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. పలు జిల్లాల్లో వాణిజ్య పంటలు నేలకొరిగాయి.












Click it and Unblock the Notifications