బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం- ఏపీ వైపు వాయుగుండం
Bay of Bengal: బంగాళాఖాతాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరింత విస్తరిస్తోన్నాయి. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ రీజియన్, బంగాళాఖాతం దక్షిణ- మధ్య ప్రాంతం, ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయి. దీనికి అనుకూల వాతావరణ పరిస్థితులు మరింత దోహదపడ్డాయి.
ఇప్పటికే కేరళ, తమిళనాడు దక్షిణ ప్రాంతం, కర్ణాటక కోస్తా తీర ప్రాంత జిల్లాల్లోకి రుతు పవనాలు ప్రవేశించాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం నాడే రాయలసీమ ప్రాంతంలోకీ నైరుతి రుతుపవనాలు అడుగుపెట్టాయి. మిగతా ప్రాంతాలకూ క్రమంగా విస్తరిస్తోన్నాయి.

అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా తీరం వెంబడి వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడన ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం మంగళవారం ఉదయం 8:30 గంటల సమయానికి ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది.
ఈ తెల్లవారు జామున 5:30 గంటల సమయానికి ఈ అల్పపీడనం మరింత ఉధృతంగా మారింది. అదే ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ ఉదయం 8:30 గంటల సమయంలో బంగాళాఖాతం ఉత్తర దిశగా కదలడం మొదలు పెట్టిందని, వచ్చే 24 గంటల్లోగా ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
క్రమంగా ఈ వాయుగుండం తుఫాన్ గా అవతరించడానికి అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది. వాయుగుండంగా బలపడిన తరువాత తుఫాన్ గా మారుతుందని, ఒడిశా తీరం వైపు చురుగ్గా కదిలే అవకాశాలు ఉన్నాయని, ఆ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఐఎండీ. ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తోన్నాయి.
నేడు కూడా వర్షాల తీవ్రత కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తోన్నాయి.
Subject: Well Marked Low Pressure area over Northwest Bay of Bengal off Odisha coast:
— India Meteorological Department (@Indiametdept) May 28, 2025
A Low Pressure Area formed over Northwest Bay of Bengal off Odisha coast in the morning (0830 hours IST) of yesterday, the 27th May 2025. It lay as a Well Marked Low Pressure Area over the same… pic.twitter.com/mA0DLdoy3f












Click it and Unblock the Notifications