Prasna Ravan: రావణ్ కు బిగుస్తున్న ఉచ్చు ?- ఏపీ సర్కార్ తాజా షాక్..!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలతో ప్రారంభించి, మావోయిస్టులకు అనుకూలంగా, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా విమర్శలు చేసిన వ్యవహారంలో ఉపా (UAPA) కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna Ravan)కు ఉచ్చు బిగుస్తోది. ఇప్పటికే ఆయనపై ఉపా చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ పై నెల్లూరు జైలుకు పంపారు. ఇప్పుడు ఆయన మొబైల్ ఫోన్ లోని డేటా రికవరీ చేసిన పోలీసులు.. తాజాగా మరో షాకిచ్చారు.
ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్వేష వ్యాప్తి చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రావణ్ మొబైల్ ఫోన్ ను విశ్లేషించిన ఫోరెన్సిక్ అధికారులు సమర్పించిన డేటా ఆధారంగా ఆయన నెలకు లక్షన్నర రూపాయలు సంపాదిస్తున్నట్లు తేలింది. దీంతో ఈ యూట్యూబ్ ఛానల్ తో లింక్ అయిన రెండు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని పోలీసులు చేసిన విజ్ఝప్తి మేరకు బ్యాంకులు వాటిని స్తంభింపజేశాయి. ఈ రెండు బ్యాంక్ ఖాతాల ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పాటు రావణ్ లావాదేవీలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రావణ్ వెనుక ఎవరున్నారనే విషయం తెలుసుకునేందుకు ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే సేకరించిన మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ఛాట్ల వివరాలు తీసుకున్నారు. అలాగే తన స్డూడియోలో రహస్య కెమెరాలతో తీసిన అమ్మాయిల వీడియోలు, వాటిని అడ్డుపెట్టుకుని చేసిన బ్లాక్ మెయిలింగ్ ఆధారంగా మరిన్ని కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దీంతో రావణ్ కు పూర్తి స్దాయిలో ఉచ్చు బిగిస్తున్నారు.














Click it and Unblock the Notifications