ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్ కు ఉరిశిక్ష..! సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్..!
ఉపా కేసులో ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna ravan), అతనికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ (Prakash raj)పై ఇవాళ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (VijayaSai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్‌లు, ప్రకాశ్ రాజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సాయిరెడ్డి కోరారు.
హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలని సాయిరెడ్డి కోరారు. ఓసీల్లో ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది, కన్వర్ట్ అయిన వారు కన్వర్ట్ అయిన తరవాత కూడా, వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికార పరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మ వారే అన్నారు.

అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతిమీద, మన దేవతలమీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఏ కులానికి, ఏ మతానికి చెందినవారు చేసినా - ఇటు సమాజం బుద్ది చెప్పాలని సాయిరెడ్డి కోరారు. అటు చట్టం-అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరి శిక్ష విధించాలన్నారు. అవసరమైతే ప్రభుత్వం చట్టాల్ని సవరించాలన్నారు. ఆ వ్యాఖ్యల్ని సమర్థించేవారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలన్నారు. బలవంతపు మత మార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించటం, మన సంస్కృతిమీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్లద్దాలు, సూట్ బూటు ధరించి మైక్ పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్ లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్‌గా హీరోయిజంగా మారిందన్నారు.

ఇలా ఒక పథకం ప్రకారం, తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలని సాయిరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేరుగా రావణ్‌ని, ప్రకాశ్‌రాజ్‌ను సమర్థించటం, హైలైట్ చేయటం అంటే, ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే అన్నారు. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలన్నారు. చట్టం వేసే శిక్షలతోపాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కేంద్రంలో అధికారపార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలని సాయిరెడ్డి డిమాండ్ చేశారు.













Click it and Unblock the Notifications