రుతుపవనాల వీరవిహారం: కరవుదీరా వర్షాలు: మొదటివారంలోనే లోటు భర్తీ
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ ప్రక్రియ ఊపందుకుంది. జూన్ లో తీవ్ర ఆందోళన కలిగించిన రుతుపవనాలు.. ఇప్పుడు వీరవిహారం చేస్తోన్నాయి. కిందటి నెల కనిపించిన మందగమనం ఇప్పుడు జోరందుకుంది. అద్భుతంగా పుంజుకొంది. జూలై మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలే దీనికి నిదర్శనం. ఏపీ, తెలంగాణ వంటి నాలుగైదు రాష్ట్రాలు మినహాయిస్తే దేశవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. దక్షిణాదిన కర్ణాటక, కేరళల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.
సాధారణంగా ప్రతి ఏడాది జూలై 8 నాటికి దేశం మొత్తాన్ని విస్తరిస్తుంటాయి నైరుతి రుతుపవనాలు. ఈ వర్షాకాల సీజన్ లో ఒక రోజు ఆలస్యంగా ఉంటే 9వ తేదీ నాటికి మొత్తాన్నీ కవర్ చేశాయి. పశ్చిమ రాజస్థాన్, హర్యానాకూ విస్తరించాయి. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ లోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం భారీగా కనిపిస్తోంది. ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులు వణికిస్తోన్నాయి. పలుచోట్ల చెట్లు సైతం నేలకూలాయి.

జూన్ లో దాదాపు మూడు వారాల పాటు రుతుపవనాల గమనం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా వర్షపాత లోటు తీవ్రంగా పెరిగింది. బలహీనపడ్డ రుతు పవనాలు, వాటి విస్తరణ మందగించడం, అలాగే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలపై ఎల్ నినో ప్రభావం వంటి కారణాల వల్ల గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత పొడి వాతావరణం జూన్‌లో కనిపించింది. నెల తిరిగే సరికి పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈ నెల మొదటి వారంలో బంగాళాఖాతం, భారత్ మధ్య ప్రాంతంలో ఏర్పడిన వరుస అల్పపీడన ద్రోణులు రుతుపవనాల ఉధృతికి ఊపిరి పోశాయి. వాటిని పునరుజ్జీవింపజేశాయి. భారత వాతావరణ కేంద్రం అందించిన తాజా సమాచారం ప్రకారం ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు దేశంలో సాధారణం కంటే 42 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ ఎనిమిది రోజుల వ్యవధిలో కురవాల్సిన వర్షపాతం 65.1 మిల్లీమీటర్లు.
దీనికి మించిన వర్షపాతం నమోదైంది. ఏకంగా 92.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్ నాటి లోటును చాలావరకు భర్తీ చేసింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ.. భౌగోళికంగా వర్షపాత విస్తరణ విషయంలో కొన్ని వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణాదిన ఏపీ, తెలంగాణ, తమిళనాడులతో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం భారత్ మధ్య ప్రాంతంపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం క్రమంగా ఉత్తరప్రదేశ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీని కారణంగా ఈ నెల 9 నుంచి భారత్ మధ్య ప్రాంతంలో వర్షాల తీవ్రత తగ్గినప్పటికీ, ఉత్తరాది రాష్ట్రాలలో మరింత బలపడే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో లోటు వర్షపాతం ఉన్న ఏపీ, తెలంగాణల్లో కూడా నైరుతి రుతుపవనాల ప్రభావం మెరుగుపడి, వర్షాలు విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో రానున్న కొద్ది రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
జూలై ఆరంభంలో కురిసిన ఈ భారీ వర్షాలు దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు చేపట్టే రైతులకు కొండంత ఆశలు రేకెత్తించాయి. విస్తారంగా పడిన వర్షాల వల్ల భూమిలో తేమ శాతంతో పాటు, సాగునీటి జలాశయాలలో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. జూన్ లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించి, రైతులు వరి, పత్తి తదితర పంటల విత్తనాలు వేయడానికి ఈ సమయం ఎంతో అనుకూలంగా మారింది. త్వరలోనే దేశవ్యాప్తంగా సమాన వర్షపాతం నమోదైతే వ్యవసాయ రంగానికి ఈ ఏడాది మెరుగైన దిగుబడి నమోదు కావొచ్చు.












Click it and Unblock the Notifications