రైల్వే స్టేషన్ పై కుప్పకూలిన క్లాక్ టవర్- ప్లాట్‌ఫామ్ నంబర్ 2 ధ్వంసం
కేరళలో అత్యంత రద్దీగా ఉండే కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఓ క్లాక్ టవర్ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు ఎవరూ అక్కడ లేరని, ఆ క్షణంలో ప్లాట్‌ఫామ్ ఖాళీగా ఉండటం వల్ల ప్రమాదం తృటిలో తప్పిందని రైల్వే పోలీస్ అధికారులు వెల్లడించారు.
శిథిలావస్థకు చేరిన ఈ చారిత్రక క్లాక్ టవర్ ను కూల్చివేయాలని కొద్దిరోజుల కిందటే రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి మార్కింగ్ కూడా చేశారు. 20 నుంచి 25 మీటర్ల ఎత్తు ఉన్న ఈ క్లాక్ టవర్ ఇది. భారీ వర్షాలకు ఇది కూలితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందుగానే పసిగట్టారు. కూల్చివేత చర్యలు చేపట్టక ముందే ఈ ఉదయం ఈ టవర్ ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్ నంబర్ 2పై కుప్పకూలింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై సీపీఎం ఎమ్మెల్యే పీఏ మహ్మద్ రియాస్ ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే అధికారుల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్‌లో కూల్చివేతకు సిద్ధంగా ఉన్న పాత నిర్మాణాల వద్ద కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా దాన్ని అలాగే వదిలేయడం వల్ల ఈ పరిణామం సంభవించిదని అన్నారు.
క్లాక్ టవర్ బలహీనపడటం, అందులో పగుళ్లు ఏర్పడినప్పుడే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఉండాల్సిందని రియాస్ సూచించారు. ప్రయాణికులు ఆ ప్రాంతంలోకి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేయకుండా ఉండటం భారీ తప్పిదమని అన్నారు. రైల్వే సిబ్బందిని అక్కడ మోహరించి ఉండాల్సిందని చెప్పారు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని, ఇలా జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
కాగా, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాత రైల్వే స్టేషన్లలో ఉన్న బలహీనమైన నిర్మాణాలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని రియాస్ డిమాండ్ చేశారు. రైల్వే నెట్‌వర్క్‌ను ఆధునీకరిస్తూ నూతన భవనాలు నిర్మించడం ఎంత ముఖ్యమో, పూర్వకాలం నాటి ఇతర కట్టడాలు సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం కూడా అంతే కీలకమని పేర్కొన్నారు. అదృష్టవశావత్తూ కోజికోడ్ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications