మమతకు భారీ ఊరట..! కలకత్తా హైకోర్టు కీలక ఉత్తర్వులు..!
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత తిరుగుబాట్లు, కేసులు, బీజేపీ దాడులతో సతమతం అవుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఇవాళ కోల్ కతా హైకోర్టులో మాత్రం తాత్కాలిక ఊరట లభించింది. టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు అధికారిక బ్యాంక్ ఖాతాల నుంచి చేసిన విమానం, హెలికాఫ్టర్ కొనుగోళ్లకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి ఆయా అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. దీనిపై టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు.. ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.
ఈడీ చర్యల నేపథ్యంలో తమ పార్టీ రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు నిధులు అందుబాటులో లేకుండా పోయాయని, కాబట్టి ఆయా అకౌంట్లపై విధించిన ఆంక్షల్ని ఎత్తేయాలని కలకత్తా హైకోర్టును టీఎంసీ కోరింది. మూడు అకౌంట్లపై కలిపి మొత్తం 440 కోట్ల నిధులు ఉండిపోవడం, ఓ రాజకీయ పార్టీగా వీటిని వాడుకోకుండా అడ్డుకునే పరిస్ధితి లేకపోవడంతో కలకత్తా హైకోర్టు.. వీటిపై విధించిన ఫ్రీజింగ్ ను తాత్కాలికంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రోజువారీ ఖర్చుల నిమిత్తం తాత్కాలికంగా తమ మూడు స్తంభింపజేసిన బ్యాంక్ ఖాతాలను నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ, టీఎంసీ (TMC) దాఖలు చేసిన పిటిషన్ పై కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇందులో ఓ మెలిక పెట్టింది. ఇలా రోజువారీ ఖర్చుల కోసం నిధులు వాడుకునే అంశాన్ని పరిశీలించేందుకు ఒక ప్రత్యేక అధికారిని హైకోర్టు నియమించింది. రిటైర్డ్ జస్టిస్ సుబ్రత తలుక్‌దార్ ను పరిశీలకుడిగా నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు టీఎంసీ ఖాతాలను స్తంభింపజేయాలని ఆదేశించేందుకు పోలీసులు సమర్పించిన ఆధారాలతో తాము సంతృప్తి చెందలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో మమతకు ఊరట దక్కినట్లయింది.














Click it and Unblock the Notifications