విసిరిన రాళ్లే మీకు పునాది అయ్యాయి: అభిజిత్ దిప్కే కు పాక్ యువకుడి ఎమోషనల్ లేఖ
దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీక్, విద్యావ్యవస్థలో మార్పులు తదితర అంశాలపై జెన్ జీ యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెల రోజులకు పైగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. అలా పార్లమెంట్ ముట్టడి సైతం చేసింది. దాంతో విద్యార్థులు, యువతపై పోలీసులు బాష్ప వాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. విద్యార్థులపై దాష్టీకాన్ని దేశంలోని ప్రతిపక్షాలు, సినీ ప్రముఖులు, ఇతరులు ఖండించారు. దాంతో ఎట్టకేలకు దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించారు. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషీని నియమించారు. దాంతో సీజేపీ తన నిరసనలను విరమించింది.
ఇక సీజేపీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. భారత్ కు దాయాదిగా ఉన్న పాకిస్థాన్ లోనూ సీజేపీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. శక్తివంతమైన మోదీ ప్రభుత్వంలోని మంత్రిని తొలగించేంతగా భారత యువత ఎలా ఉద్యమించారన్న దానిపై పాకిస్థాన్ యువత ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు లేఖలు రాస్తోంది. ఈ క్రమంలో లాహోర్ కు చెందిన ఓ యువకుడు అభిజీత్ దిప్కేకు హృదయపూర్వకంగా లేఖ రాశాడు. భారత్ లోని భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛను అక్కడివాళ్లు ఆస్వాదిస్తున్నారు. కానీ పాకిస్థాన్ లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు అని పేర్కొన్నాడు.
" ప్రియమైన అభిజీత్.. నేను లాహోర్ నుంచి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. ఇక్కడి గాలిలోని కాలుష్యం దిల్లీను తలపిస్తుంది. ఇక్కడ నేనొక యువ కార్యకర్తను. నేను ఈ ఉత్తరం రాయడానికి కారణం.. మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుగా ఉంటుంది" అని లాహోర్ కు చెందిన ఎతేషమ్ హాసన్.. దిప్కేకు రాశారు. ఈ లేఖలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా.. నిరుద్యోగులను కాక్రోచ్ లుగా అభివర్ణించడాన్ని గుర్తు చేశారు. పాకిస్థాన్ లోనూ యువత ఇలాంటి వ్యవస్థీకృత లోపాలనే అనుభవిస్తోంది" అని హసన్ లేఖలో పేర్కొన్నాడు.

యువతపై చేసిన నెగెటివ్ రీమార్క్ నే అభిజీత్ దిప్కే.. పాజిటివ్ గా తీసుకుని ఇంత పెద్ద పార్టీని నిర్మించడం నిజంగా అభినందనీయం అని అన్నాడు. కాక్రోచ్ జనతా పార్టీని చూస్తుంటే నీపై విసిరిన రాళ్లనే పునాది లాగా నిర్మించుకోవాలన్న సామెతను గుర్తుచేస్తోందని పేర్కొన్నాడు. భారత్ లో యువత అనుభవిస్తున్న కష్టాలనే ఇంచుమించు పాకిస్థాన్ లోని యువత కూడా అనుభవిస్తోందని అన్నాడు. ప్రస్తుతం హసన్ పాకిస్థాన్ లోని లాహోర్ నుంచి రాసిన ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications