బుల్లి సొరకాయలతో నెలకు రూ. 15 లక్షలు ఆదాయం!
వ్యవసాయం అంటే నష్టాల బాట అనే మాటను తిరగరాస్తూ, సరికొత్త ఆలోచనతో విదేశీ మార్కెట్‌ను శాసిస్తున్నాడు బెంగళూరుకు చెందిన కరిశెట్టి రమేష్ అలియాస్ కరిగౌడ. తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న మూస పద్ధతులకు స్వస్తి చెప్పి, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న 'బేబీ సొరకాయల' (Baby Bottle Gourds) సాగు చేపట్టి నెలకు ఏకంగా రూ. 14 నుంచి 15 లక్షల వరకు ఆదాయం గడిస్తున్నాడు. బెంగళూరు అర్బన్ జిల్లా కార్లపుర పాళ్యలోని తన 3.5 ఎకరాల పొలంలో పండించే ఈ బుల్లి సొరకాయలు ఇప్పుడు ఏకంగా ఖతార్ దేశానికి ఎగుమతి అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
సాధారణంగా సొరకాయలను పెద్దగా పెరిగే వరకు ఉంచి అమ్ముతుంటారు. కానీ, విదేశీ మార్కెట్లలో దాదాపు 500 గ్రాముల బరువుండే లేత 'బేబీ సొరకాయలకు' ఉన్న డిమాండ్‌ను గుర్తించిన కరిగౌడ, 'స్వీకార్ 045 ఎఫ్1' రకం విత్తనాలను ఎంచుకున్నాడు. జూన్-జూలై నెలల్లో విత్తనాలు నాటితే, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రోజుకు సుమారు ఒక టన్ను చొప్పున దిగుబడి వస్తుంది.

కిలో రూ. 50 చొప్పున దళారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో, రోజుకు రూ. 50,000 వంతున నెలకు రూ. 14 లక్షల నుంచి రూ. 15 లక్షల ఆదాయం లభిస్తోంది. మొత్తం 90 రోజుల సీజన్‌లో రూ. 45 లక్షల వరకు రాబడి వస్తోందని, పెట్టుబడి ఖర్చులు పోను మంచి నికర లాభం మిగులుతోందని కరిగౌడ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
ఆధునిక సాంకేతికత.. మల్టీ క్రాపింగ్ ఫార్ములా!
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సంప్రదాయంగా టమోటా, వంకాయ, జొన్నలు సాగు చేసిన కరిగౌడకు ఆశించిన ధరలు దక్కలేదు. దీంతో డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ షీట్లు, నూతన యంత్రాలను జోడించి వినూత్న పంటల వైపు అడుగులేశాడు. ఎగుమతుల ప్రక్రియను దళారులే చూసుకుంటుండటంతో, తను పూర్తిగా నాణ్యమైన దిగుబడి సాధించడంపైనే దృష్టి సారిస్తున్నాడు. కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా, తమిళనాడులోని హోసూరు మార్కెట్‌కు వంకాయలు, టమోటాలు కూడా సరఫరా చేస్తూ ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం పొందుతున్నాడు.
రైతాంగానికి ఆదర్శంగా నిలిచిన యువ రైతు
పంట ఏదైనా సరే, మార్కెట్ అవసరాలను బట్టి సాగు చేస్తే వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించవచ్చని కరిగౌడ నిరూపించాడు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ వ్యూహాలను జోడిస్తే వ్యవసాయం కూడా లాభసాటి వ్యాపారంగా మారుతుందని చెప్పడానికి ఈ బెంగళూరు రైతు కథనం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది.














Click it and Unblock the Notifications
