ఈ జిల్లాల్లో డేంజర్ బెల్స్ - రికార్డు ఉష్ణోగ్రతలు, తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో రికార్డు అయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెండ్ వార్నింగ్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
మాడు పగులుతోంది
వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు సీరియస్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలంగాణలోని దాదాపు 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. గత పదేళ్లలో ఏప్రిల్ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈస్థాయి ఎండలు చూడటం ఇదే తొలిసారి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్, ములుగు, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ వార్నింగ్ జారీ చేసింది.

రికార్డు ఉష్ణోగ్రతలు
మరో 3 రోజులపాటు ఎండలు మండిపోతాయని ఐఎండీ హెచ్చరించింది. జమ్మికుంట-45.6, మంథని-45.2, నిడదమానురు-45.2, కోల్వాయి-45.1, మాడుగలపల్లి-45.1, మర్యాల-45.1, వీణవంక-45.1, వెల్గటూరు-45.1, భద్రాచలం-44, హైదరాబాద్-42 గా నమోదైంది. ఏపీలోనూ భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నంద్యాలజిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

అప్రమత్తంగా ఉండాలి
తిరుపతిజిల్లా రేణిగుంటలో 45.7, కడపజిల్లా ఖాజీపేట, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 45.7, విజయనగరంజిల్లా గజపతినగరం, కర్నూలుజిల్లా కోడుమూరులో 44.8, అనంతపురంజిల్లా తాడిపత్రిలో 44.4, పల్నాడుజిల్లా మాచెర్లలో 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. వృద్దులు, పిల్లలు, వీధి వ్యాపారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వీలయినంతవరకూ ఓర్‌ఎస్, చలువ చేసే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications