బీ అలర్ట్ - ఈ జిల్లాలకు ఐఎండీ తాజా హెచ్చరికలు...!!
ఎండ వేడితో అనేక ప్రాంతాలు ఉడికిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణీ కార్తె రాకముందే ఎండలతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. మరో అయిదు రోజుల పాటు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. 45 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. దీంతో, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45.5 డిగ్రీలకు చేరాయి. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీలు, కడప జిల్లా ఖాజీపేటలో 45.3, పల్నాడు జిల్లా మాచర్లలో 45.2, కర్నూలు రూరల్‌లో 44.9, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.6, ప్రకాశం జిల్లా మార్కాపురం, విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.2, మన్యం సాలూరులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 41 మండలాల్లో తీవ్రంగా, 116 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. రాష్ట్రవ్యాప్తంగా 183 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

శనివారం.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లో తీవ్రమైన వడగాడ్పులు వీయడంతో కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలు, అక్కడక్కడా అంతకుమించి నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
రానున్న ఐదు రోజుల్లో దక్షిణాదిలో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, వీటికి ఆనుకుని ఒడిశా, ఛత్తీ్‌సగఢ్, మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలోని అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగడమే కాకుండా వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. వచ్చేనెలలో మరింత వేడిగాలులు వీస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications