మండుతున్న వేసవిలో చల్లని కబురు
మండుతున్న ఎండల్లో ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు వినిపించింది. ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అయితే మరోవైపు నుంచి మాత్రం ఎండల తీవ్రత ఉంటుందని వెల్లడించింది. ఏపీలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి భానుడు మండిస్తున్నాడు. మధ్యాహ్నానికి మాడు పగిలిపోతోంది. సాయంత్రం ఆరుగంటల తర్వాతే ఎండల తీవ్రత తగ్గుతోంది.
ఇలా ఎండలు మండుతున్న తరుణంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనుండగా మరికొన్నిచోట్ల ఎండ తీవ్రంగా ఉండనుంది. దీనివల్ల అసౌకర్యమైన వాతావరణం నెలకొంటుంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం ఎండలు తీవ్రంగానే ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. ఈనెల ఐదోతేదీన నంద్యాలలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 43.5 డిగ్రీలు, అనంతపురంలో 43.1 డిగ్రీలు, తిరుపతిలో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, గర్భిణీలు, వృద్ధులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేట్ కు గురికాకుండా ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైన పని ఉంటేనే బయటకు రావాలని, మధ్యాహ్నం వేళ అసలు రావొద్దని, వచ్చినా గొడుగు కచ్చితంగా ఉండాలని, దాహం వేయకపోయినా తరుచుగా మంచినీరు తాగుతుండాలని, అలాగై వైద్యుల సలహాలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కొద్దిరోజులు ఈ తరహా వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని, అప్పటివరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications