మళ్లీ ముంచుకొస్తోంది, ఈ ప్రాంతాల్లో ఇక కుండపోత..!!
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిరంతరం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న వేళ మరోసారి ఐఎండీ తాజా హెచ్చరికలు చేసింది. మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు ముప్పు ఉందని అలర్ట్ జారీ చేసింది. దీంతో, అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల పై వాతావరణ శాఖ తాజాగా అలర్ట్స్ జారీ చేసింది. మహారాష్ట్ర పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. బుధవారం నాటికి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. మరోవైపు మంగళవారం అండమాన్ పరిసరాల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.

అటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూసీ వరద ప్రవాహానికి హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అటు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజ్‌లోకి ఇన్ ఫ్లో 6 లక్షల 86 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రధాన కాలువలతో కలుపుకొని బ్యారేజి దిగువకు 6 లక్షల 86 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి వరద నీరు అధికారులు విడుదల చేస్తున్నారు. మరో వైపు గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఉదయం 5 గంటలకు 9 లక్షల 57 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. దిగువన కోనసీమలో వరద జోరు కొనసాగుతుంది. కృష్ణానదికి వరద ప్రవాహం పెరగడంతో తుళ్లూరు, తాడేపల్లి, కొల్లపర, దుగ్గిరాల మండలాల్లోని పొలాలు ముంపునకు గురవుతున్నాయి.












Click it and Unblock the Notifications