దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఏపీలోని ఈ జిల్లా
Temperature in AP: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ఫలితంగా ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. ఇదే తరహా వాతావరణం మరి కొన్నిరోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తోన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రత భారీగా నమోదవుతుందని, వడగాల్పులు వీస్తాయని స్పష్టం చేస్తోన్నారు.

సోమవారం నాడు దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 41 డిగ్రీలను అధిగమించింది. ఇందులో రాయలసీమలోని మూడు జిల్లాలు అగ్రస్థానంలో ఉండటం.. ఇక్కడి ఎండ తీవ్రత స్థాయిని తెలియజేసింది. సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర అధికంగా పగటి ఉష్ణోగ్రత రికార్డయింది.
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ నిలిచాయి. ఈ జాబితాలో కర్నూలు టాప్‌లో ఉంది. సోమవారం నాడు ఇక్కడ రికార్డయిన ఉష్ణోగ్రత 42.2 డిగ్రీలు. సాధారణం కంటే 2.4 డిగ్రీలు అధికం.
రెండో స్థానంలో నంద్యాల నిలిచింది. ఇక్కడ 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 2.4 డిగ్రీలు ఎక్కువ. అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాల్లో అనంతపురం జిల్లాది మూడో స్థానం. ఇక్కడ 41.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. సాధారణం కంటే 1.8 డిగ్రీలు అధికంగా ఇక్కడ ఎండ తీవ్రత నమోదైంది.
కర్ణాటకలోని గుల్బర్గా 41.6, మహారాష్ట్రలోని జివూర్- 42.0, మాలెగావ్- 42.0, షోలాపూర్- 41.5, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్- 41.5, పశ్చిమ బెంగాల్‌లోని అసాన్‌సోల్- 41.7 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాల ఆధారంగా ఆ జాబితాను రూపొందించింది వాతావరణ కేంద్రం.












Click it and Unblock the Notifications