అందుకే దర్శిలో నామినేషన్ వేయలేకపోయాం: ఎమ్మెల్యే బూచేపల్లి
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో చోటు చేసుకున్న పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఒక అభ్యర్థికి రక్షణ కల్పించి నామినేషన్ వేయించలేని స్థితిలో పోలీసు వ్యవస్థ ఉండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక పోలీసులను ప్రయోగిస్తోన్నారని మండిపడ్డారు.
ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసులను అడ్డుగా పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు, ఇన్‌ఛార్జీలను కట్టడి చేస్తూ సీట్లను బలవంతంగా కైవసం చేసుకోవాలని టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తోందని బూచేపల్లి అన్నారు. దర్శి మున్సిపాలిటీలో నామినేషన్లు వేయడానికి వెళ్లిన తమ అభ్యర్థులపై దాడి చేసి, నామినేషన్ పత్రాలను చించివేసి అడ్డుకున్నారని, అక్కడ పోలీసులుఉన్నా, అభ్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం కల్పించకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు.

అభ్యర్థులను రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్లి నామినేషన్లు వేయిస్తామని పోలీసులు నమ్మించి మోసం చేశారని, చివరకు తనను హౌస్ అరెస్టు చేశారని బూచేపల్లి శివప్రసాదరెడ్డి తెలిపారు. దర్శిలో వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. దర్శి డీఎస్పీ వ్యవహరించిన తీరు అత్యంత అమానుషంగా అభివర్ణించారు.
అభ్యర్థులకు రక్షణ కల్పించి నామినేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి నామినేషన్లు వేయిస్తామని పోలీసులు మొదట తమను నమ్మించారని, చివరకు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా లేని వ్యక్తులపై కేసులు బనాయిస్తూ ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తోన్నారని బూచేపల్లి పేర్కొన్నారు. నామినేషన్లతో సంబంధం లేని పోసిం మధుసూదన్‌రెడ్డి, అమెరికా నుంచి వచ్చిన గూడ శ్రీధర్‌రెడ్డి, గోపీనాథ్‌రెడ్డి, చింతలపూడి శ్రీనివాసరెడ్డి, బత్తుల వెంకటేశ్వర్లు, బండి గోపాల్‌రెడ్డి తదితరులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోన్నారని విమర్శించారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే భయంతో గూడ శ్రీధర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటే ఎన్నికలు నిర్వహించడం ఎందుకని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, అధికార కూటమి, పోలీసు యంత్రాంగం కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నాయని ధ్వజమెత్తారు. దర్శిపై సమగ్ర విచారణ జరిపి, నామినేషన్లకు అడ్డంకులు సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.














Click it and Unblock the Notifications
