వైకుంఠ ఏకాదశి నుంచి తిరుమలలో..!!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే ఉత్తర ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం సాయంత్రం ఆయన వైకుంఠ ద్వార దర్శనాలకు డెప్యూటేషన్ విధులకు విచ్చేసిన ఉద్యోగులు, పోలీసులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు ఇతర టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మక వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో స్వామివారి దర్శనాన్ని దివ్య అనుభూతిగా మార్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ల కేటాయింపులో విధానాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. వైకుంఠ ద్వార దర్శన విధులకు వచ్చిన సిబ్బంది వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకుని సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు.
భక్తుల భద్రత, రద్దీ నిర్వహణకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను వినియోగిస్తున్నట్లు వెంకయ్య చౌదరి చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా భక్తులు, వాహనాల రద్దీపై ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. టీటీడీ, పోలీస్, విజిలెన్స్ విభాగాల నుండి ఐటీ నిపుణులు సమన్వయంతో పని చేస్తూ ఎప్పటికప్పుడు భక్తుల సమాచారాన్ని అప్ డేట్ చేయాలని చెప్పారు.
దర్శనానికి పట్టే సమయం, భక్తుల సంఖ్య, రద్దీ ప్రదేశాలు, వాహనాల పార్కింగ్.. వంటి అంశాలన్నింటినీ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లోని ఇంటిగ్రేటెడ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల సెంటర్ లో ప్రదర్శించాలని ఆయన చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో మాత్రమే కాకుండా.. ఇక ముందు కూడా తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలూ రాకుండా ఉండటానికి ఏఐ- ఆధారిత వ్యవస్థను నిర్మించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications