"పులివేందులలోను జగన్ గెలవలేని పరిస్థితి.. చంద్రబాబు వల్లే"
విజయవాడ : రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న ధర్నాలు, సభలపై ఘాటైన విమర్శలు చేశారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. నెలకోసారి మాత్రమే రైతులను గుర్తుకు తెచ్చుకునే జగన్, ధర్నాలు సభల పేరిట రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చి, మళ్లీ కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు.
కరువు పరిస్థితులను చక్కదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్ష ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రాయలసీమకు నీరు తెప్పించిన ఘనత చంద్రబాబుదేనని, వచ్చే ఎన్నికల్లో పులివెందులలో పోటీ పడ్డా వైఎస్ జగన్ గెలవలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. అనంతపరంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడామని చెప్పిన దేవినేని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు దక్కవన్నారు.

రాష్ట్రం కోసం చంద్రబాబు శ్రమిస్తోన్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, చంద్రబాబు నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందన్న నమ్మకంతోనే ప్రజలంతా ఆయనకు అండగా నిలబడుతున్నారని అభిప్రాయపడ్డారు దేవినేని. వైఎస్ హయాంలో ప్రాజెక్టులన్నింటిని గాలికి వదిలేశారని, దానివల్లే ఇప్పుడిన్ని కష్టాలు పడాల్సి వస్తోందని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తూ సాగుతున్నారని ఈ సందర్బంగా దేవినేని పేర్కొన్నారు. బుధవారం నాడు మధ్యాహ్నాం గుంటూరులో మీడియాతో మాట్లాడిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు దేవినేని.












Click it and Unblock the Notifications