పెద్దిరెడ్డి అడ్డాలో మరోసారి టెన్షన్, మీరు నీతి, నిజాయితీగా గెలిచారా, చెప్పండి?
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీలో పెద్దాయనగా పేరు తెచ్చుకున్న పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అడ్డాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీద నిరసన వ్యక్తం చేసే నాయకులు, సామాన్య ప్రజల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతా ఉంది.
పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మండల సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీపీ భాస్కర్‌రెడ్డి సమాచారం ఇవ్వడంతో సంబంధిత అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ పుంగనూరు మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం దర్గరకు చేరుకున్నారు.

వైసీపీ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాలేదని, ఇతర పార్టీల నాయకులను బెదిరించి వైసీపీ నాయకులే నామినేటేడ్ తరహాలో ఎన్నికయ్యారని, అందుకే మండల మీట్ జరగనివ్వబోమని టీడీపీ, జనసేన నాయకులు స్పష్టం చేశారు. ఆ సందర్బంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుంగనూరులోని ఎంపీడీవో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సంచరించే ప్రజలు సైతం అటువైపు వెళ్లడానికి భయపడిపోయారు.

తరువాత ఎంపీడీవో అబ్దుల్‌రహీంకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పుంగనూరు రూరల్, గంగవరం సీఐల ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఎంపీపీ భాస్కర్‌రెడ్డి సహా వైసీపీ సభ్యులుఎవరూ హాజరుకాలేదు. కేవలం అధికారులు మాత్రమే రావడం, సభ్యులు లేకపోవడంతో కోరం లేదని ఈ సమావేశాన్ని పుంగనూరు ఎంపీడీవో వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications