చంద్రబాబును మించిపోయారు: మంత్రుల భజనకు సీఎం ఫ్లాట్: సర్వం..జగన్ నామ స్మరణ..!
అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు పేరుతో ప్రభుత్వ పధకాలు అమలు అనేకం అమలు చేసారు. నాడు వైసీపీ తప్పు బట్టింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ పేరుతో పథకాలు అమలు చేసారు. ఆ తరువాత నెమ్మదిగా చంద్రబాబు పేరుతో పధకాలను కొనసాగించారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నింటికీ వైయస్సార్ పేరుతో అమలు ప్రారంభించారు. కానీ, కొంత కాలంగా ట్రెండ్ మారుతోంది. మంత్రులు ముఖ్యమంత్రి వద్ద మార్కుల కోసం జగన్ పేరును తమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగించే పధకాలకు ప్రతిపాదిస్తున్నారు. తొలుత వీటికి ఇష్టడపనట్లుగా కనిపించిన సీఎం..ఇప్పుడు ఎస్ అంటున్నారు. అంతే..ఇక, ఏపీలో ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పేరుతో అనేక పధకాలు వచ్చేసాయి.

చాలా పథకాలకు జగనన్న పేరు జోడింపు
"అమ్మ ఒడి పథకానికి జగనన్న అమ్మ ఒడి అని పేరు పెట్టిన సందర్బంలో జగన్ కు ప్రచారం ఇష్టం లేదు. మేం బలవంతం చేస్తే ఒప్పుకున్నారు. బలవంతం చేసి మరీ ఆ పథకానికి జగన్ పేరు పెట్టడానికి ఒప్పించాం" ఇదీ అసెంబ్లీ సాక్షిగా ఏపీ ఆర్ధిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకొచ్చారు. కానీ, ఆ తరువాత మంత్రులు పోటీ పడీ మరీ ప్రభుత్వ పథకాలకు జగన్ పేరు పెట్టేస్తున్నారు. జగన్ సైతం అడ్డుచెప్పటం లేదు. దీంతో వైయస్సార్ పేరుకు ఇప్పుడు జగన్ పేరే పోటీగా మారింది.
ప్రభుత్వంలో జగన్ పేరుతో అమలవుతున్న పధకాలు ఇప్పటి వరకు.. ఇలా ఉన్నాయి.
జగనన్న అమ్మ ఒడి
జగనన్న విద్యాదీవెన
జగనన్న వసతి దీవెన
జగనన్న గోరు ముద్ద
జగనన్న చేదోడు
జగనన్న విద్యాకానుక

వైయస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం
రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా మరో జగనన్న పేరు వెలుగులోకి వచ్చింది.ఉగాది రోజు ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ళ స్థలాలకు సంబంధించిన కాలనీలకు వైయస్సార్ జగనన్న కాలనీలు గా నామకరణం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సందర్భంలో ప్రచారం సందర్భంగా ప్రజలు తన తండ్రి చేసిన పనుల ద్వారా ఎలాగైతే గుర్తుపెట్టుకున్నారో.. తనను కూడా అలానే గుర్తుపెట్టుకుని తన ఫోటోను కూడా వైయస్ ఫోటో పక్కనే ఉండాలని చెప్పేవారు. ఇది ఒక్కింత వరకు బాగానే ఉన్నప్పటికీ అన్ని పథకాలకు తండ్రి పేరు లేదా తన పేరు పెట్టుకుంటుండటంపై వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు స్వాగతిస్తున్నారు కానీ తటస్థంగా ఉండే ప్రజలు మాత్రం ఇదేం విడ్డూరమని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video


వైయస్ హయాంలో గాంధీ కుటుంబ సభ్యుల పేర్లు
ఇక రాజశేఖర్ రెడ్డి కూడా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ కొత్త పథకం ప్రారంభించిన గాంధీ కుటుంబానికి సంబంధించిన వారి పేర్లను ఆ పథకాలకు పెట్టేవారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా పేరు పెట్టగా.. పోలవరంకు ఇందిరా సాగన్ అని పెట్టడం జరిగింది. ఇక ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగే సంక్షేమ పథకాలకు గాంధీ కుటుంబీకుల పేర్లు మాత్రమే పెట్టేవారు. ఇక చంద్రబాబు హయాంలో ముందుగా ఎన్టీఆర్ పేరుతో సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యేవి. ఆ తర్వాత చంద్రన్న తోఫా, చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న చేయూత లాంటి పేర్లను పెట్టారు. అయితే వీటికి పేర్లు పెట్టడంపై నాడు వైసీపీ విమర్శలు గుప్పించింది.
ఇదిలా ఉంటే పథకాలకు వినియోగించేది ప్రజల డబ్బులే కాబట్టి.. పథకాలకు కుటుంబంలోని వారి పేర్లు, లేదా నాయకుల పేర్లు పెట్టడంకంటే... దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన తెలుగు నేతల పేర్లు పెడితే బాగుంటుందనే అభిప్రాయంను తటస్థులు వ్యక్తం చేస్తున్నారు. .












Click it and Unblock the Notifications