తిరుమలకు వెళ్లిన భక్తులకు గుడ్ న్యూస్: మరిన్ని ఉచిత బస్సులు..!!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు కల్పిస్తోన్న సౌకర్యాలు, ఇతర వసతులపై టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. పలు ఆదేశాలను జారీ చేశారు. ఉచిత బస్సుల సంఖ్యను మరింత పెంచడం, తిరుమలలో వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దడం వంటివి ఇందులో ఉన్నాయి.
తిరుపతి పరిపాలనా భవనంలో ఏర్పాటైన ఈ సమావేశానికి జేఈవో వీ వీరబ్రహ్మం, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కేవీ మురళీకృష్ణ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. తిరుమలలో భక్తులు వివిధ ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా ఉచిత బస్సులను పెంచాలని సూచించారు. ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికోసం వీలైతే బస్సులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

తిరుమలలో ఘన వ్యర్థా పదార్థాలను వేగంగా తరలించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఉత్సవాలు, విశేష రోజుల్లో టీటీడీ ఆలయాల సుందరీకరణలో భాగంగా గార్డెన్, ఎలక్ట్రికల్ విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృంధాలు శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా కళాప్రదర్శనలు ఇచ్చారని, వారిని అభినందిస్తూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తరాలు రాయాలని, సంబంధిత కళాబృందాల పోటోలను పంపాలని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
అప్పలయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులువుగా గుర్తించి వెళ్లేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ భూముల మాస్టర్ డేటాబేస్, కల్యాణ మండపాల నిర్వహణపై నివేదిక తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాల్లో ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తరాలు రాయాలని అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు.
వివిధ రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఉత్తర ప్రత్యుత్తరాలను వేగవంతం చేయాలన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ ల నుండి శ్రీవారి మెట్టు వద్దకు చేరుకోవడానికి ప్రైవేట్ వాహనదారులు భక్తుల నుండి అధిక ధరలు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై చర్యలు చేపట్టాలని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట, అమరావతి, తిరుచానూరు ఆలయాల మాస్టర్ ప్లాన్ పై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. ఆలయాలలో లైటింగ్, గ్రిల్స్, తదితర అంశాలపై ఆర్కిటెక్ అధికారుల సూచనలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications