ఏపీలో దేశంలోనే తొలి భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్.. సర్కార్ కు కాసుల పంట!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండబోతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్లలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ఏపీకి భారీ ఆదాయాన్ని ఇవ్వబోతోంది. దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్‌గా ఏపీలో రిలయన్స్ చేపడుతున్న భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ నిలవనుంది. దీని ద్వారా గనుల శాఖకు రూ.65 వేల కోట్ల రాబడి రానుంది.
రూ.2.73 లక్షల కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్
ప్రత్యక్షంగా 3,500 నుంచి 5 వేల మందికి, పరోక్షంగా 20 నుంచి 35 వేల మందికి ఉపాధి లభించనుంది. రూ.2.73 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్ట్‌లో చింతలపూడిలో 1,200 హెక్టార్లు, రేచెర్లలో 2,225 హెక్టార్ల బొగ్గు గనులు ఉన్నాయి. రెండు బ్లాకుల్లో కలిపి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి.

ఈ బొగ్గు నిల్వల వినియోగానికి ఏపీ సర్కార్ కు భారీ ఆదాయం
30 ఏళ్లపాటు ఈ బొగ్గు నిల్వలను వినియోగించుకున్నందుకు 14 శాతం రాయల్టీ రూపంలో రూ.50 వేల కోట్లు, బొగ్గు ధరలో 2.75 శాతం రెవెన్యూ వాటాగా రూ.10 వేల కోట్లు, జిల్లా ఖనిజ ఫౌండేషన్ కింద రూ.5 వేల కోట్లు గనుల శాఖకు దక్కనున్నాయి. అనుబంధ పరిశ్రమల నుంచి ఎస్‌జీఎస్టీ రూపంలో మరిన్ని వేల కోట్లు రావచ్చని అంచనా.
దేశంలోనే తొలిసారి భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్
దేశంలోనే తొలిసారి ప్రారంభిస్తున్న ఈ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ద్వారా భూగర్భంలోనే బొగ్గును మండించి సింగ్యాస్‌ను పైకి తీసుకొస్తారు. దీని నుంచి హైడ్రోజన్, మెథనాల్, అమ్మోనియా, సింథటిక్ నేచురల్ గ్యాస్, సింథటిక్ ఇంధనాలు తయారు చేయవచ్చు. 2030 నాటికి రోజుకు 20-50 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ సింగ్యాస్ ఉత్పత్తి చేసే ప్రధాన ప్లాంట్ అందుబాటులోకి రానుంది.
వచ్చే ఏడాది పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
ఈ ఏడాది ఖనిజ అన్వేషణ, వచ్చే ఏడాది పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. 2028-30 మధ్య కమర్షియల్ గ్యాసిఫైయర్ బావుల డ్రిల్లింగ్, 2030 నాటికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి, అనుమతులు, భూసేకరణకు ఏలూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ను నోడల్ అధికారిగా నియమించింది. లోతైన బొగ్గు నిల్వలను వినియోగించుకునే ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊతం ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications