దసరా వేళ ఇంద్రకీలాద్రి భక్తులకు బిగ్ అలర్ట్ - టికెట్లు, దర్శనం లో కీలక మార్పులు..!!
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్దం అయింది. గతం కంటే ఈ సారి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు టికెట్ల విధానంలో మార్పులు చేసారు. దర్శనాల్లో కొత్త నిర్ణయాల అమలుకు సిద్దం అయ్యారు. క్యూ లైన్ల నిర్వహణలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ... దర్శనాల విషయంలోనూ ప్రణాళికా బద్దంగా వ్యవహరించనున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా వేడుకులకు సిద్దమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి 20 వరకు జరిగే ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇందు కోసం భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రూ. 100, రూ. 300 రూ. 500 దర్శన టిక్కెట్లను పూర్తిగా రద్దు చేశారు. ఈ క్యూ లైన్లను ఉచితంగా మార్చి, దర్శన ప్రక్రియ వేగంగా జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. 'శ్రీఘ్ర దర్శనం' కోసం ప్రత్యేకంగా ఒక లైన్‌ను కేటాయించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వీఐపీ, ప్రోటోకాల్ భక్తులకు ఉదయం 6:00 నుంచి 8:00 గంటల మధ్య ,రాత్రి 8:00 నుంచి 10:00 గంటల మధ్య మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు.

దసరా దర్శనాల వేళ కీలక మార్పులు
కాగా.. రూ. 1,000 టిక్కెట్ కొనుగోలు చేసే భక్తులను కుమ్మరిపాలెంలోని టీటీడీ స్థలం నుంచి ఆలయ వాహనాల్లో కొండపైకి తీసుకెళ్లటంతో పాటుగా వారికి త్వరిత దరశనం క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. ఈ దర్శనం కోసం 'మనమిత్ర' వాట్సాప్ సేవ ద్వారా టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఇక.. కొండపైకి వెళ్లే ప్రతి ఒక్కరికీ ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా స్క్రీనింగ్ నిర్వహించిన తరువాతనే కొండపైకి వాహనాలను అనుమతించనున్నారు. కాగా.. కొండపై ఉన్న వినాయక ఆలయం నుంచి 1,650 మీటర్ల మేర క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా నిండినప్పుడు, ఒకేసారి 8,500 మంది భక్తులు ఇందులో వేచి ఉండే అవకాశం ఉంటుంది. కొత్త అన్నదాన భవనంలో ప్రతిరోజూ 15,000 మందికి ఉచిత భోజనం అందించేలా ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు.













Click it and Unblock the Notifications
