ఇంద్రకీలాద్రి దసరా వేడుకలకు వెళ్తున్నారా - కీలక సూచనలు, పూర్తి సమాచారం..!!
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ సారి దసరా ఉత్సవాలకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సాంకేతికతను వినియోగిస్తున్నారు. తాజాగా ఉత్సవాల సమాచారం, సేవల గురించి మొబైల్ యాప్, చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. బీ దసరా 2025 అనే పేరిట ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో యాప్ ఉంది. భక్తులకు అవసరమైన అన్ని సేవల వివరాలు అందులో ఉంచారు.
ఇంద్రకీలాద్రి పై భక్తులకు ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల వేళ కొండ కు వచ్చే భక్తులకు అన్ని రకాల సేవలు.. సమాచారం అందించేందుకు చాట్‌బాట్ సేవలను ఈ నంబరుతో 94418 20717 అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని ఏఐ ఆధారిత సంభాషణ వేదికగా రూపొందించారు. ఈ నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకున్నా తర్వాత మీ వాట్సాప్‌లో అమ్మ లేదంటే హాయ్ అనే మెసేజ్ చేయాలి. వాట్సాప్‌లో మెసేజ్ చేయగానే తెలుగు, ఆంగ్లం ఏ భాషలో సమాచారం కావాలని అడుగుతుంది. తర్వాత మెయిన్ మెనూ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని టచ్ చేస్తే, వరుసగా దర్శనం, విరాళాలు, గ్రీవెన్స్, సదుపాయాలు, సేవలు, పండగలు వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో దేనినైనా టిక్ చేస్తే ఆ వివరాలన్నీ మొత్తం మెసేజ్ రూపంలో వస్తాయి. యాప్‌లో సేవలన్నీ చాట్‌బాట్‌లోనూ అందుబాటులో ఉంచారు.

దర్శన సమయాలు, టిక్కెట్ల కొనుగోళ్లు, వీఐపీ దర్శనాలు, పూజల షెడ్యూల్ సంబంధించిన వివరాలు అందుబాటు ఉంచారు. అమ్మవారి అలంకారాలు, వాటికి సంబంధించిన ఫొటోలతో పాటుగా ప్రసాదాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ రద్దీ పరిస్థితి తెలుసుకోవచ్చు. ఇక.. అన్నప్రసాదం హాళ్ల వివరాలు, రియల్ టైమ్ క్యూలైన్ అప్‌డేట్స్ సైతం ఇస్తారు. దేవస్థానం బస్సులు, వాటిని లైవ్ ట్రాకింగ్ చేసుకొనే సౌకర్యం ఉంది. పార్కింగ్ సమాచారం, మ్యాప్ నావిగేషన్ సౌకర్యం కల్పించారు. ఈసారి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. దసరా సందర్భంగా నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈసారి ఏఐ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications