శ్రీవారికి ఇన్ఫోసిస్ మూర్తిగారి 2 కేజీల బంగారం విరాళం
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. శనివారం 87,171 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 38,273 మంది తలనీలాలను సమర్పించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3.68 కోట్ల రూపాయల ఆదాయం అందింది.
ఇవ్వాళ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తి.. స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉదయం ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు.. రంగనాయకుల మండపంలో నారాయణమూర్తి దంపతులకు ఆశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శేషవస్త్రాన్ని బహూకరించారు.

ఈ సందర్భంగా- నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులు టీటీడీకి బంగారంతో తయారు చేసిన శంఖు, కూర్మ విగ్రహాలను అందజేశారు. వాటి బరువు రెండు కేజీలు. 24 క్యారెట్లతో తాబేలు, బంగారు శంఖును తయారు చేశారు. వాటిని శ్రీవారికి కానుకగా అందజేశారు. టీటీడీ కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి.. వాటిని స్వీకరించారు.
అనంతరం సుధామూర్తి- తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వేంకటేశ్వరస్వామి తమ ఇలవేల్పు అని, 70 సంవత్సరాలుగా తాను శ్రీవారిని దర్శించుకుంటోన్నానని చెప్పారు. ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శిస్తానని అన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా పని చేయడం తన అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. తొలిసారిగా తాను 1953లో తిరుమలకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. తిరుమలలో సౌకర్యాలు రోజురోజుకూ మెరుగుపడుతున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications