60ఏళ్లు కాపురం చేశాక: అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర చర్చ
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో బుధవారం నేతల మధ్య ఆసక్తికర చర్చలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఛాంబర్ వద్ద మంత్రులు కాసు వెంకటకృష్ణా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, మాజీ మంత్రి కోమటిరెడ్డి, టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎంపి సిఎం రమేష్‌ల మధ్య చర్చ జరిగింది.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెసు పార్టీలో విలీనం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రతి సమావేశం తెలంగాణకు అనుకూలమేనని, లేదంటే ఆయన ఎప్పుడో జైలుకు వెళ్లేవారన్నారు.

మంత్రి కాసు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి డబుల్ గేమ్ ఆడుతూ.. కేంద్రం కనుసన్నుల్లో నడుస్తున్నారన్నారు. అరవై ఏళ్లు కాపురం చేశాక విడాకులు ఇస్తామంటే ఇప్పుడు మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారని కోమటిరెడ్డితో కాసు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి తెలంగాణ అని పేరు పెట్టి సమైక్యంగా ఉంటే బాగుంటుంది కదా అన్నారు.
రేవంత్ రెడ్డి కల్పించుకొని కిరణ్ తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం సమైక్యంగా ఉండేదన్నారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అంశంపై చర్చ జరగగా దళిత ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సిద్ధంగా ఉన్నారని కోమటిరెడ్డి అన్నారు.
టిడిపి - బిజెపి
టిడిపి - బిజెపి పొత్తులపై చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై బిజెపి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఓ టిడిపి ఎమ్మెల్యే మధ్య చర్చ జరిగింది. మనం కలుస్తున్నాం కదా అని టిడిపి ఎమ్మెల్యే అనగా యెన్నం స్పందిస్తూ... గతంలో టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పుడు బిజెపికే నష్టం జరిగిందని, ఇప్పుడు పూర్తిగా మునిగిపోతున్న టిడిపితో పొత్తు ఏమిటని, మోడీ హవా జాతీయ స్థాయిలో ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications