YCP 'ఐప్యాక్' కు గుడ్ బై.. TDPలో చేరిక
రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం మనం చూస్తూనే ఉంటాం. వారికి అధికారమే పరమావధి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మరే ప్రత్యేక రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇవన్నీ చూసిన ప్రజలు నిర్వేదానికి గురవుతున్నారు. ఒక పార్టీకి, ఒక మాటకు కట్టుబడి ఉండలేనివారంతా రాజకీయాల్లోకి రావడమేంటి? మనం ఓటు వేయడం ఏమిటి? అని వారిలో వారే ప్రశ్నించుకుంటున్నారు.

నాయకుల్లానే వ్యూహకర్తలు కూడా..
రాజకీయ నాయకులు పార్టీలు ఎలా మారుతున్నారో రాజకీయ వ్యూహకర్తలు కూడా ఇప్పుడు పార్టీలు మారుతుతున్నారు. ఇది కొత్త ట్రెండ్ అన్నమాట. ఒక పార్టీ కోసం పనిచేసే రాజకీయ వ్యూహకర్తలు మరోపార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఇదేమీ కొత్త కాకపోయినప్పటికీ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న 'ఐప్యాక్' టీమ్ సభ్యుడు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న రాబిన్ శర్మ టీమ్ లో డైరెక్టర్ హోదాలో చేరిపోయారు. 2014లో నరేంద్రమోడీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కోసం గోవాలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు, ఎవరికి, ఎలా అనుకూలమో దాన్ని గమనించి వ్యూహకర్తలు కూడా ప్లేటు ఫిరాయిస్తున్నారు.

పోల్ వర్కౌట్ కోసం శంతన్
వచ్చే ఎన్నికల్లో జగన్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా 'ఐ ప్యాక్' పనిచేస్తోంది. ఇందులో కీలక సభ్యుడిగా ఉన్న శంతన్ సింగ్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న రాబిన్ శర్మ షోటైమ్ కన్సల్టింగ్ (STC)బృందంలో చేరారు. 'ఐప్యాక్' టీమ్ లో కోర్ మెంబర్ గా పనిచేసిన శంతన్ ను టీడీపీ పోల్ వర్కౌట్ కోసం నియమించుకుంది. 2024 ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం వ్యూహాలను సిద్ధం చేయడమే ఎస్టీసీ పని.

అన్నీ తెలిసివుంటాయనే ఉద్దేశంతో..
ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి అయిన శంతన్ 'ఐప్యాక్' కోసం పనిచేస్తున్న రుషిరాజ్ సింగ్ కు సన్నిహితుడు. ఎస్టీసీలో చేరకముందు వరకు 'ఐప్యాక్' పొలిటికల్ వింగ్ ను చూశారు. 2019 ఎన్నికల సమయంలోను ఆయన వైసీపీ కోసం పనిచేశారు. తాజాగా 'ఐ ప్యాక్' తో తెగదెంపులు చేసుకొని టీడీపీ గూటికి చేరారు. సింగపూర్ లోని లీకాన్ యీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 'ఐ ప్యాక్' లో చేరిన శంతన్ సంస్థకు రాజీనామా చేశారు. ఎక్కువ కాలం ఆయన వైసీపీకి చేసివుండటంతో ఆ పార్టీ అనుసరిస్తోన్న వ్యూహాలు, బలహీనతలను తెలుస్తాయనే ఉద్దేశంతో టీడీపీ శంతన్ కు ఆహ్వానం పలికింది.












Click it and Unblock the Notifications