ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత..!!
తెలుగు రాష్ట్రాల్లో పోలీసు అధికారులు.. సిబ్బందిలో విషాదం నెలకొంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. అమెరికాలో ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 5 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతు న్న బాలసుబ్రహ్మణ్యం.. అమెరికాలో చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూశారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా పనిచేస్తూ ఈఏడాది ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎస్పీగా బాలసుబ్రహ్మణ్యం పనిచేశారు.
బాలసుబ్రహ్మణ్యం కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ, అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం పోలీస్ మరియు ప్రభుత్వ శాఖల్లో తీరని లోటును మిగిల్చింది. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఏపీ కేడర్‌లో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. సుదీర్ఘ వృత్తి జీవితంలో రవాణా, సాంకేతిక, శాంతి భద్రతల విభాగాలలో విశేష సేవలందించారు. అనేక సందర్భాల్లో ఐఏఎస్ అధికారులకు సమాన మైన హోదాల్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఐజీగా, ఈ-ప్రగతి అథారిటీ సీఈఓగా, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సీఈఓగా పనిచేసి, తన నైపుణ్యాలను ప్రదర్శించారు.

కీలక హోదాల్లో విధులు.. ప్రముఖుల సంతాపం
కాగా, ఈ ఏడాది (2026) ఆరంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మరియు ఎండీగా నియమించింది. విధి నిర్వహణలో అందరి ప్రశంసలు అందుకున్నారు. కాగా, బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలసుబ్రమణ్యం మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులకు సానుభూతి తెలిపారు. నిజాయితీ, అంకితభావం, గట్టి నిర్ణయాలు తీసుకోగల సమర్థవంతమైన అధికారిగా బాలసుబ్రమణ్యం గుర్తింపు పొందారన్నారు. పోలీస్, ఇంటెలిజెన్స్, రవాణా, ప్రజా పాలన విభాగాల్లో ఆయన అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. పాలనలో నూతన ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయన కృషి చేశారని కొనియాడారు.













Click it and Unblock the Notifications
