వారసత్వం-హరికృష్ణ వ్యాఖ్య: బాలకృష్ణ-జూ.ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా?
హైదరాబాద్: నందమూరి హీరోల మధ్య విభేదాలు అనే అంశంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఈ సంక్రాంతికి బాలకృష్ణ డిక్టెటర్, జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలు విడుదలవుతున్నాయి. ఒకేసారి, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు విడుదల కానుండటం మరోసారి చర్చకు దారి తీసింది.
బాబాయ్ బాలకృష్ణకు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారని, సయోధ్య కుదుర్చుకున్నారని కొద్ది రోజుల క్రితం ఊహాగానాలు వినిపించాయి. అయితే, నాన్నకు ప్రేమతో ఆడియో విడుదల సందర్భంగా అవి ఊహాగానాలేనని తేలాయంటున్నారు.
ఇరువురు హీరోల గురించి ఎప్పుడు చర్చ వచ్చినా... వారసత్వం అనే అంశం తెరపైకి వస్తుంటుంది. సినిమాల్లో, రాజకీయంగా సీనియర్ ఎన్టీఆర్ వారసుడు ఎవరు అనే చర్చ కూడా జరుగుతుంటుంది. ఇరువురి సినిమాలు ఒకేసారి విడుదల కానుండటం చర్చకు దారి తీస్తోంది.

ఇటీవల నాన్నకు ప్రేమతో ఆడియో విడుదల సందర్భంగా మాజీ ఎంపీ హరికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ తన కొడుకు జూనియర్‌ను తన అంశగా చెప్పారని, ఆయన హిందీవర్షన్ బ్రహ్మర్శి విశ్వామిత్రలో జూనియర్ నటించారని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు కూడా తాజా చర్చకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. పరోక్షంగా హరికృష్ణ.. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను భావిస్తున్నట్లుగా ఆ వ్యాఖ్యలలోని గూడార్థమని అంటున్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత కొందరు బాలయ్య ఫ్యాన్స్.. జూనియర్ సినిమాను దూరం పెట్టాలని భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
ప్రత్యక్షంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవి కేవలం సృష్టి అని, అలాగే కొందరు అభిమానుల అత్యుత్సాహం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇరువురి మధ్య విభేదాల అంశం బహిరంగంగా ఎక్కడా కనిపించలేదని గుర్తు చేస్తున్నారు. బాలయ్య, జూనియర్, కళ్యాణ్ రామ్.. ఇలా అందరినీ తాము ఆదరిస్తామని ఎక్కువ మంది అభిమానులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications