కాంగ్రెసులాగే: బాబు సమన్యాయం బెడిసికొట్టిందా?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమన్యాయం బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. కాంగ్రెసుకు తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం తేడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెబుతూనే సమన్యాయం నినాదాన్ని పుచ్చుకుని సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు తెలంగాణవాదుల నుంచి వచ్చాయి.
తెలంగాణవాదుల విమర్శల మాట ఎలా ఉన్నా, పార్టీలోని ఇరు ప్రాంతాల నాయకుల మధ్య గురువారం తలెత్తిన విభేదాలు, ఘర్షణపూరిత వాతావరణం మాత్రం కాంగ్రెసుకు, తెలుగుదేశం పార్టీకి మధ్య తేడా లేదనే వాదనను ముందుకు తెచ్చాయి. తెలంగాణకు చెందిన పార్టీ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్ సీమాంధ్రకు చెందిన పార్టీ ఎంపీ మోదుగల వేణుగోపాల్ రెడ్డిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

మీడియా సాక్షిగా తెలుగుదేశం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు రెండు విడిపోయి పరస్పరం తిట్టుకున్నారు. కాంగ్రెసులో గత కొంత కాలంగా సాగుతున్న ఇరు ప్రాంతాల వైరుధ్యాలను తెలుగుదేశం పార్టీ కూడా చివరి నిమిషంలో ప్రదర్శించింది. దీంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న జాగ్రత్తకు విఘాతం కలిగిందనే మాట వినిపిస్తోంది.
పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగుతూ గందరగోళం సృష్టిస్తూ వచ్చారు. వారికి ధీటుగా తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనకు దిగుతూ వచ్చారు. పార్లమెంటు వెలుపలా, లోపలా తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు సాగిస్తూ వచ్చారు. సీమాంధ్ర ఎంపీలు ఆందోళనలు చేస్తున్న సమయాల్లో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు మౌనంగా ఉండిపోయారు.
తెలంగాణకు చెందిన నామా నాగేశ్వర రావు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీకి నాయకుడు. కానీ, ఆయన ప్రమేయం లేకుండానే సీమాంధ్ర ఆందోళనలు సాగుతూ వచ్చాయి. నామా నాగేశ్వర రావు సభలో కనిపించరని, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఓ వైపు తెలంగాణవాదాన్ని మరోవైపు సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వైయస్ జగన్ ఓ సందర్భంలో విమర్శించారు. చంద్రబాబు సమన్యాయం వైఖరిని అమలు చేసే బాధ్యతలో భాగంగా నామా నాగేశ్వర రావు సభకు కూడా రాకుండా వెసులుబాటు కల్పించారనే అభిప్రాయం కలుగుతోంది.
కాగా, తెలంగాణ బిల్లు లోకసభ రానున్న నేపథ్యంలో గురువారంనాడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉన్నారు. ఉదయం పూట, ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులకు లోకసభలో వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం కూడా చేశారు. తెలంగాణ బిల్లుకు తొలి ఓటు తనదేనని నామా నాగేశ్వర రావు ఉదయం పూట ప్రకటించారు. అయితే, చంద్రబాబు మార్గనిర్దేశమేదీ ఫలించినట్లు లేదు. తెలుగుదేశం సీమాంధ్ర సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లోకసభలో తీవ్ర గందరగోళానికి దిగారు. ఆయన చాకు కూడా తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆత్మరక్షణ కోసం అద్దాలు మాత్రమే పగులగొట్టానని, తన వద్ద చాకు లేదని వేణుగోపాల్ రెడ్డి అంటున్నారు.
ఇంతకాలం సహనంతో వ్యవహరిస్తూ వచ్చిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యులు నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్ చివరి నిమిషంలో సీమాంధ్ర సభ్యులపై విరుచుకుపడినట్లు కనిపిస్తోంది. తెలంగాణను అడ్డుకోబోమనే చంద్రబాబు వైఖరికి భిన్నంగా వ్యవహారాలు నడుస్తుండడంతో వారు ఓర్పు కోల్పోయి వ్యవహరించినట్లు కనిపిస్తున్నారు. మొత్తంగా, చంద్రబాబు సమన్యాయం వైఖరి బెడిసికొట్టి కాంగ్రెసుకు, తెలుగుదేశం పార్టీకి తేడా లేదనే అభిప్రాయం కలుగుతోందని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా కూడా వ్యాఖ్యానించడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications