మార్పుపై కన్నాVs కిరణ్: సిఎం వర్గం ఘాటు స్పందన
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి మార్పు పైన జోరుగా ప్రచారం సాగుతోంది. విభజన విషయంలో పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న కిరణ్‌ను మార్చుతారని, కొత్త రాష్ట్రానికి కన్నా లక్ష్మీ నారాయణను సిఎంగా చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కిరణ్ విభజనను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అధిష్టానం కిరణ్‌ను పరిగణలోకి తీసుకుండా విభజన ప్రక్రియ వైపు వెళ్తోంది.
విభజన అనంతరం కొత్త ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు సిఎంగా కన్నాను నియమించాలని అధిష్టానం యోచిస్తోందని ప్రచారం జరిగింది. మొదట కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని అందుకోసం అనుకున్నా ఆయన తిరస్కరించడంతో కన్నా వైపు అధిష్టానం మొగ్గిందంటున్నారు. రెండు రోజుల క్రితం కన్నా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో రెండు సిఎం మార్పు ప్రచారం రెండు రోజులుగా మరింత జోరందుకుంది.

మార్పు ప్రచారం నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి వర్గం ధీటుగా స్పందించింది. ఇప్పటికే అధిష్టానం ఒక తప్పు చేసిందని, ముఖ్యమంత్రిని మార్చి మరో తప్పు చేస్తుందని తాము భావించడం లేదని, కిరణ్ మార్పు అంత సులభం కాదని మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు అన్నారు. మార్పు ప్రచారంలో వాస్తవం ఉండవచ్చునని అయితే కిరణ్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారని మరో మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.
తెలంగాణ ప్రాంత నేతలు కొందరు ముఖ్యమంత్రిని తొలగించాలని, ఇంకొందరు అది తమకు అనవసరమని తెలంగాణ ఇస్తే చాలంటున్నారు. కిరణ్‌ను వెంటనే ఆ పదవి నుండి పార్టీ నుండి డిస్మిస్ చేయాలని పాల్వాయి నిప్పులు చెరిగారు. పొన్నం ప్రభాకర్, జానా రెడ్డి వంటి నేతలు మాత్రం కిరణ్ మార్పు తమకు అనవసరమన్నారు. ముఖ్యమంత్రి మార్పు విషయం తమకు తెలియదని ఇంకొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. మరోవైపు కిరణ్, కన్నాలు మార్పుపై స్పందించారు.
నవ్వుతూ వెళ్లిన కిరణ్
రవీంద్ర భారతిలో బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్‌ను ముఖ్యమంత్రి మార్పుపై విలేకరులు ప్రశ్నిస్తే ఆయన నవ్వుతూ కారు ఎక్కి వెళ్లిపోయారు. తద్వారా ఆ ప్రచారాన్ని ఆయన లైట్‌గా తీసుకున్నారు.
ఒప్పందం లేదు: కన్నా
కిరణ్ స్థానంలో వస్తారని ప్రచారం జరుగుతున్న కన్నా స్పందించారు. సిఎం సీటు కోసం తాను ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని, తన ప్రతిష్ట దిగజార్చేలా కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, తాను సిఎం రేసులో లేనని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications