నాడు అలా, నేడిలా: సూటిగా... చిరంజీవికి పవన్ కళ్యాణ్ కౌంటర్!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిరంజీవి విషయమై రాజకీయంగా కుండబద్దలు కొట్టారా? అంటే అవుననే అంటున్నారు. తాను జనసేనలోకి తన అన్నయ్యను ఆహ్వానించనని, తమ ఇద్దరిదీ రాజకీయంగా వేర్వేరు దారులని చెప్పారు.
కొద్ది రోజుల క్రితం.. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అవసరమైన సమయంలో తాను అన్నయ్యకు అండగా నిలబడతానని చెప్పారు. పవన్ ఆ వ్యాఖ్యల వెనుక రాజకీయం ఉందని, చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఏర్పడితే అన్నయ్య కోసం పవన్ ఏమైనా చేస్తారనే అర్థం అందులో దాగుందని ఊహాగానాలు వినిపించాయి.
అయితే, ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల అనంతరం పవన్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యా. చిరంజీవి, తన దారి వేరు అని, ఆయన కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారని, తాను మరో దారిని ఎంచుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇద్దరికీ రాజకీయంగా కచ్చితమైన భావాలున్నాయని చెప్పారు.

రాజకీయంగా తామిద్దరు దారులు వేరని స్పష్టం చేశారు. కుటుంబం వేరు, రాజకీయాలు వేరన్నారు. అన్నయ్యగా ఆయనంటే గౌరవమని చెప్పారు. కానీ రాజకీయంగా ఆయనతే విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అదే సమయంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విఫలమైందని ప్రశ్నించగా... ఓ స్టార్‌గా రాజకీయాల్లోకి వచ్చినా పదవి తన లక్ష్యం కాదని, ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం కావాలని, వాళ్ల గళాన్ని వినిపించే నాయకుడు కావాలని చెప్పారు. నా దృష్టి దాని పైనే ఉందన్నారు.
ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా అనుభవమే ముఖ్యమని చెప్పారు. ముందు ప్రజల్లోకి వెళ్తేనే అనుభవం వస్తుందన్నారు. పిల్లవాడు పుట్టగానే 20 ఏళ్ల యువకుడు కాలేడన్నారు. పార్టీ కూడా అంతేనని చెప్పారు. 2019 నాటికి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తానో ఆ రోజు పరిస్థితుల్ని బట్టి ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకే పార్టీ పెట్టానని, పదవుల కోసం కాదని అభిప్రాయపడ్డారు.
లక్ష్యం లేకుండా లేనని, అధికారం రానంత మాత్రాన మూటాముల్లె సర్దుకుపోవాలని, మొఖం చూపించొద్దన్నది తన ఉద్దేశం కాదని పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం. ప్రజా సమస్యలపై పోరాటాన్ని నమ్ముతానని, అధికారం అనేది వాటి నుంచే ఉప ఉత్పత్తి అవుతుందన్నారు.
అయితే, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన దాదాపు నాలుగేళ్లకు ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన విషయం తెలిసిందే. పార్టీ, రాజకీయాల పైన పవన్ వ్యాఖ్యల ద్వారా... ప్రజారాజ్యం పార్టీ విషయంలో పరోక్షంగా చిరంజీవికి ఆయన కౌంటర్ ఇచ్చినట్లుగానే భావించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications