బిజెపిలోకి జీవిత: రాజశేఖర్ వ్యూహాత్మకమా, ఆ తర్వాతే
హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శక నిర్మాత జీవిత రాజశేఖర్ సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, జీవితతో పాటు ఆమె భర్త రాజశేఖర్ పార్టీలో చేరలేదు. తన భర్త కూడా త్వరలో పార్టీలో చేరుతారని ఆమె బిజెపిలో చేరిన సందర్భంగా చెప్పారు. కానీ, రాజశేఖర్ వ్యూహాత్మకంగానే ప్రస్తుతం బిజెపిలో చేరక పోయి ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జీవిత బిజెపిలో చేరినందున పార్టీలో ఆమెకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి రాజశేఖర్ కూడా త్వరలో చేరుతారంటున్నారు. జీవితకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఉందని భావిస్తే ఆయన కూడా త్వరలో కమలం తీర్థం పుచ్చుకుంటారని లేదంటే మౌనంగా ఉండిపోవచ్చుననే ప్రచారం సాగుతోంది. జీవిత మాత్రం తన భర్త త్వరలో పార్టీలో చేరుతారని చెప్పడం గమనార్హం.

2009 తర్వాత జీవిత, రాజశేఖర్ దంపతులు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలోకి వెళ్లినప్పటికీ మిగిలిన పార్టీలతోను చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సమయంలో వారు కాంగ్రెసులో ఉన్నారు. వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెట్టాక ఆ పార్టీలోకి వెళ్లినా, అందులో ఇమడలేక బయటకు వచ్చారు.
తెలుగుదేశం, బిజెపి తదితర పార్టీలతో చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. సరైన ప్రాధాన్యత ఇస్తారనే హామీ లేకపోవడంతో వారు మౌనం దాల్చారు. ఆ తర్వాత కాంగ్రెసులో ఉంటున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications