బాబు వర్సెస్ కేసీఆర్: జగన్‌పై ఏపీలో వ్యతిరేకత పెరుగుతోందా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్‌తో జగన్ దోస్తీ పైన సీమ ప్రజలు మండిపడుతున్నారా? జగన్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతోందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నోటుకు ఓటు వ్యవహారం వేడెక్కిస్తోంది.
ఈ విషయమై జగన్ తీరు పైన ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. తెరాసకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఏపీ ప్రజలకు రుచించడం లేదని అంటున్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. తెరాసకు మద్దతు తర్వాత జగన్ పైన వ్యతిరేకత పెరుగుతోందని పేర్కొంది.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య దాదాపు ప్రతి విషయంలోను విభేదాలు కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియేట్ పరీక్షలు మొదలుకొని ఏపీ ప్రభుత్వ రంగ సంస్థల ఖాతాలు స్తంభింప చేయడం వంటి కేసీఆర్ చర్యల పైన జగన్ మౌనం వహించడాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారని రాసింది.

కేసీఆర్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగంగా మద్దతు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. బాబుకు వ్యతిరేకంగా జగన్ చేపట్టిన ఆందోళనలు సఫలం కాలేదని పేర్కొంది కేసీఆర్‌కు అండగా నిలిచినందుకే జగన్ ఆందోళనకు పిలుపునిచ్చారని ప్రజలు భావించారని రాసింది.
ఓటుకు నోటు వ్యవహారంలో తాను బాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిమాట, కేసీఆర్‌కు మద్దతిస్తున్నట్లుగా ప్రజలు గుర్తించారని జగన్ అర్థం చేసుకుంటున్నారని పేర్కొంది.
కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో జగన్ తొలుత మౌనం దాల్చారని, తర్వాత ప్రజల ఆగ్రహావేశాలు చూసి దిద్దుబాటు ప్రయత్నాలు చేశారని, కేంద్రమంత్రికి లేఖ రాశారని పేర్కొంది. అయితే, ఆ దిద్దుబాటు చర్యల్లోను తప్పటడుగులు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోందని రాసింది.












Click it and Unblock the Notifications