ఏపీలో డ్రగ్ కలకలం.. ఐసిస్ ఉగ్రవాదులు వాడే డ్రగ్స్.. ఎక్కడంటే ?
తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా దుమారం రేపుతోంది. ఇన్నాళ్లు ఛోటా మోటాగా అక్కడక్కడ మాత్రమే తక్కువ మోతాదులో డ్రగ్స్ పట్టుబడ్డప్పటికీ.. ఈసారి మాత్రం ఏపీ వ్యాప్తంగా ఈగల్ టీం జరుపుతున్న దాడుల్లో అధికారులకు సైతం ఊహించని షాక్ తగిలింది. ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్ ని అధికారులు గుర్తించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారంగా మారింది.
కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఉన్న భార్గవ్ మెడికల్ షాప్ లో ఈ ఐసిస్ డ్రగ్స్ ను గుర్తించారు. ఐసిస్, బోకో హారం లాంటి ఉగ్రవాద సంస్థలు ఈ డ్రగ్ విజయవాడ పరిసరాల్లో మెడికల్ షాపుల్లో సులువుగా లభ్యమవడం ఏంటని షాక్ అవుతున్నారు. ట్రేమడాల్ అనే సైకో ట్రోపిక్ సబ్ స్టెన్స్ (మాదక ద్రవ్యం) అనుమతి లేకుండా అమ్ముతున్నట్టు నిర్ధారించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించగా.. సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

అలసట, నిద్ర రాకుండా ఉండటానికి, ఎక్కువ సమయం ఉత్తేజంగా పనిచేయటానికి ఐసిస్, బోకోహరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు.. ఈ ట్రెమడాల్ మాత్రలను అందిస్తుంటాయి. అందుకే వీటికి ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ డ్రగ్‌గా, ఫైటర్ డ్రగ్‌గా పేరుంది. గత రెండేళ్ల కాలంలో ఈ ఒక్క షాపులోనే 55, 961 ట్రెమడాల్ ట్యాబెల్ట్స్, 2, 794 ఇంజెక్షన్లు విక్రయించినట్టు తేల్చారు. అవనిగడ్డలోని భార్గవ మెడికల్ స్టోర్స్‌లో ఈ మాదకద్రవ్యాల రాకెట్ జరుగుతున్నట్టు గుర్తించారు.
ఇక ట్రెమడాల్ తయారీ, వినియోగంపై 2018 లోనే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అంతే కాకుండా NDPS చట్టపరిధిలోకి వీటిని తీసుకొచ్చింది. అనుమతించిన పరిమాణం, కాంబినేషన్‌లో మాత్రమే తయారు చేసి వైద్యుల సూచనలతో విక్రయించాలని స్పష్టం చేసింది. కానీ అధికారుల తనిఖీల్లో ఇప్పుడు ఈ డ్రగ్ బాగోతం బయటపడడం అధికారులను సైతం కలవరపెడుతోంది. రికార్డుల్లోనే అంత మేర సేల్స్ జరిగితే.. లెక్కల్లోకి రాకుండా ఎంకెన్ని విక్రయించి ఉంటారో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మెడికల్ స్టోర్ యజమాని కొనకళ్ల రామ్మోహన్‌పై NDP చట్టం కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అధికారుల విచారణలో మెడికల్ స్టోర్ యజమాని చాలా కాలంగా ఈ మాత్రలు, ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్టు సమాచారం. దీంతో అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో అనేక మంది ఈ మత్తు పదార్థానికి బానిసలుగా మారి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications