టిడిపి ఎమ్మెల్యే మోదుగుల ఆస్తులపై ఐటీ దాడులు: బెంగళూరులో కూడా
గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి చెందిన ఆస్తులపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరులోని ఆయన నివాసంతో పాటు కార్యాలయాలపై ఐటీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు సమాచారం.
ఐటీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి మంగళవారం మధ్యాహ్నం నుంచి సోదాలు చేశారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా బెంగళూరులోని ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో అవకతవకలు గుర్తించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే బుధవారం కూడా మోదుగులకు చెందిన హైదరాబాద్, గుంటూరు కార్యాలయాల్లో కూడా ఈ దాడులు నిర్వహించనున్నట్లు తెలిసింది. మోదుగుల బెంగళూరులో అందుబాటులో లేని సమయంలో ఈ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మోదుగుల అందుబాటులో లేకపోవడంతో ఐటీ అధికారులు ఆయన భార్య వద్ద నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. అయితే, అధికారి పార్టీ ఎమ్మెల్యేపై ఐటి దాడులు జరగడంతో ఇది ప్రాధాన్యాంశంగా మారింది.
వ్యాపారుల ఇళ్లపై ఐటీ దాడులు
కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రముఖ వ్యాపారుల ఇళ్లపై బుధవారం ఉదయం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నంద్యాలలో బంగారు వ్యాపారి, ఓ ట్రాన్స్‌పోర్టు వ్యాపారవేత్త ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తనిఖీలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications