విశాఖలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ: రోడ్డునపడ్డ 300 మంది టెక్కీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో ఇప్పుడిప్పుడే నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తోన్న విశాఖపట్నంలో ఓ ఐటీ సంస్ధ బోర్డు తిప్పేసింది. ఆకర్షణీయమైన వేతనాలతో యువతను ఆకట్టుకుని భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించిన ఎక్సాల్ట్ఐటీ సంస్థ యజమాని సుమారు రూ. 2 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు.
దీంతో 300 మంది సాప్ట్‌వేర్ ఇంజనీర్లు రోడ్డున పడ్డారు. వివరాల్లోకి వెళితే... కిరణ్ కుమార్ అనే వ్యక్తి విశాఖపట్నం కేంద్రంగా 'ఎక్సాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' పేరిట ఐటీ సంస్థను ఏర్పాటు చేశారు. మధురవాడ ఐటీసెజ్ హిల్ నెంబరు-2లో ఫిబ్రవరి 28న ఏపీ మంత్రి చేతుల మీదుగా ఎక్సాల్ట్ అనే ఐటీ సంస్థను ప్రారంభించారు.

అనంతరం విశాఖలోని నిరుద్యోగ యువతకు ఆకర్షణీయమైన వేతనాలను ఎరగా చూసి తన కంపెనీలో చేరేందుకు వచ్చిన వారి నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించాడు. సుమారు 300 మంది నిరుద్యోగులు రూ.60 వేల నుంచి లక్షరూపాయల వరకు ఆ సంస్థ యజమానికి చెల్లించారని తెలుస్తోంది.
ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుందని చెప్పిన కిరణ్ కుమార్ కంపెనీ ప్రారంభించి ఐదు నెలలు గడవకముందే బోర్డు తిప్పేశారు. సంస్ధ యజమాని కిరణ్ కుమార్ ఫోన్‌కు చేస్తే స్విచాప్ అని వస్తోందని ఉద్యోగులు తెలిపారు. ఇప్పటి వరకూ పనిచేసిన దానికి జీతాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో మోసపోయామని తెలుసుకున్న ఉద్యోగులు ఎక్సాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యజమానిపై పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications